Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

*ఒకే నాణేనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండు ముఖాలు: ప్రధాని మోడీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ కి అసలు దోస్త్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ను దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలలో ఓడించింది ఎవరని ప్రశ్నించారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ప్రధాని విమర్శించారు. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏమీ జరిగింది… ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టేనని అన్నారు. విశ్వసనీయమైన పార్టీ కేవలం బీజేపీనని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి పరంపరను ఆ పార్టీ నుండే వచ్చిన కేసీఆర్ కొనసాగించారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇరిగేషన్ స్కీమ్ ను… ఇరిగేషన్ స్కాం చేశారు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అవమానించాయని చెప్పారు. కాంగ్రెస్ బీసీలను దొంగలనీ అంటుంది… ఆ మాటలు అన్న నేత బెయిల్ పై బయట తిరుగుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుండి బీసీలకు అన్యాయం జరిగింది… బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై నిన్న అధికారులతో భేటీ అయ్యానని ప్రధాని మోదీ చెప్పారు. వర్గీకరణ తొందరగా జరిగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చాను… రోడ్ మ్యాప్ రెడీ చేయమని చెప్పానన్నారు. కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గించినా.. కాంగ్రెస్ ప్రభుత్వాలు, కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు కార్బన్ పేపర్ సర్కార్ వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రాజెక్ట్ లు త్వరితగతిన పూర్తి చేయవని అన్నారు. వారికి ప్రాజెక్ట్ ల నుండి జేబులు నిండాలని తెలిపారు. 20 లక్షల మెట్రిక్ టన్నలు బియ్యాన్ని అదనంగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ కుటుంబము కోసం ఆలోచిస్తే బీజేపీ మాత్రమే మీ పిల్లల భవిష్యత్ కోసం పని చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

 

*రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని అన్నారు. మీ జేబులోని లక్ష కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్టు కడితే.. పిల్లర్లు కుంగి పోతున్నాయి. ఇందులో అవినీతి జరిగిన ప్రతి రూపాయిని మళ్లీ మీకు జేబులో పెడతాం. అలాగే.. ‘ఇప్పుడు తెలంగాణలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య కొట్లాట జరుగుతోంది. దేశంలో ప్రధానమంత్రి మోదీ… రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ పదవుల్లోనే శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ముందు వరుసలో మాకు బీఆర్ఎస్ పార్టీ పోటీగా ఉంటే… దాని వెనకాల బీజేపీ, ఎంఐఎం ఉంది. దేశంలో బీజేపీ పార్టీ వెనకాల బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మాకు వ్యతిరేకంగా ఎంఐఎంను దింపి ఓట్లను చీల్చుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన వారిపై సీబీఐ ఈడీ కేసులు నమోదు అవుతాయి. నామీద కూడా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారణ జరిపారు. నా ఇంటిని, తాళాలను కూడా లాక్కున్నారు. నామీద అక్రమ కేసులు పెట్టి పార్లమెంటు నుండి బయటకు పంపారు. దేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో నాకు నివాసం ఉందని సంతోషంగా ఇంటి తాళాలు ఇచ్చి వేశాను. కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ కేసులు ఎందుకు నమోదు అవుతలేవో ప్రజలు తెలుసుకోవాలి. కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలో మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు వాటిపై చట్టసభల్లో మద్దతు తెలపడమే నిదర్శనం. మీతో నాకు రాజకీయ సంబంధమే కాదు.. కుటుంబ-రక్త సంబంధం కూడా ఉంది. మా నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి మొదలుకొని మా నాన్న రాజీవ్ గాంధీ వరకు మీతో ఉన్న సంబంధమే నాకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధతను కల్పించి ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

 

*బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే: అమిత్ షా
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021లో విగ్రహ ప్రతిష్టపన చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అమిత్ షా అన్నారు. 370 ఆర్టికల్ ని కాంగ్రెస్ అడ్డుకుంది.. అయినా మోడీ సర్కారు ఆర్టికల్ ని రద్దు చేసిందని తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్ట్రైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారు.. నిరుద్యోగులకు భృతి ఏమైందని ప్రశ్నించారు. 2.50 కోట్ల మందికి కేంద్రం ఉద్యోగాలు ఇచ్చినా, ఎక్కడ పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టేనని అమిత్ షా తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారన్నారు. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు పెంచారని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఓట్లు అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామన్నారు. తొలి క్యాబినెట్ లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తామని చెప్పారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తాం.. ప్రజారోగ్యం కోసం 10 లక్షల భీమా కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా.. ఒక్క ఓటు పటాన్ చెరు బీజేపీ అభ్యర్థికి.. మరో ఓటు మోడీకి వేయండని అమిత్ షా తెలిపారు.

 

*రాష్ట్రంలో ఒక్కొక్కరిపై కేసీఆర్ రూ. 1.4 లక్షల అప్పు మోపాడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున్ ఖర్గే తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అధ్వరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ.. ‘మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. తెలంగాణకు 5లక్షల 70వేల కోట్ల అప్పు మిగిల్చారు. ఒక్కొక్కరిపై 1లక్ష 40 వేల అప్పు మోపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. కేసీఆర్… ఇందిరమ్మను, సోనియమ్మను, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన ఘనత ఇందిరమ్మది. బ్యాంకుల జాతీయకరణ చేసిన ఘనత ఇందిరమ్మది. ఆనాడు పేదలకు భూములు పంచి వారికి అండగా నిలిచింది ఇందిరమ్మ. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమం అందింది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. చేయూత పథకం ద్వారా రూ. 4వేలు పెన్షన్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. కేసీఆర్, మోదీలా మేం బూటకపు హామీలు ఇవ్వం.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారేంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. కాంగ్రెస్ గెలుపును ఆపేందుకు బీజేపీ, బీఆరెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ను గెలిపించండి… కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయండి’ అని ఖర్గే పిలుపునిచ్చారు.

 

*ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మల్లు భట్టి విక్రమార్క మధీర నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘భట్టి నియోజవర్గానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. రాహుల్ తరహాలోనే భట్టి కూడా తెలంగాణలో పాదయాత్ర చేశారు.. ఇది సంతోషాన్నిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాహుల్, భట్టి పాదయాత్ర చేశారు. మా అమ్మతో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతం కోసం కాంగ్రెస్ నేతలు సహా చాలా మంది పోరాడారని సోనియా నాతో చెప్పారు. తెలంగాణ కలలు సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా సందేశమిచ్చారు’ అని పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. నిన్న నేనో ఇంటికి వెళ్లాను.. వాళ్లతో మాట్లాడాను. అసంపూర్తిగా ఉన్న ఇల్లు చూపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను మరిచిపోయింది. ఈ ప్రభుత్వం పేదలను వదిలేసి. ధనికుల కోసమే పని చేస్తోంది. ప్రజలే ముఖ్యం.. ప్రజలే అందరిపైనా ఉంటారని మహాత్మగాంధీ మొదలుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధానులందరూ అంతే అదే భావించారు. కానీ కేసీఆర్, మోదీ దీనికి విరుద్దంగా ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేయలేదు. కనీస మద్దతు ధర పంటలకు లభించడం లేదు. బిడ్డల భవిష్యత్ కోసం తెలంగాణ తల్లులు తల్లడితున్న పరిస్థితి ఉంది. పేపర్ లీకేజీ ఘటనలతో బిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులుగానే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో చాలా మందికి పదవులు వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు ఫాం హౌసుల్లోనే పడుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం భట్టి వంటి కాంగ్రెస్ నేతలు.. ప్రజల్లో తిరుగుతూ పాదయాత్రలు చేస్తున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ బుద్దేంటో ప్రజలకు తెలిసిపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆరుకు ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి జనవరిలో చేయాల్సిన కొన్ని స్కీంలు ఇప్పుడే చేసేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే స్కీంలను తీసుకోండి.. కానీ ఓటేయొద్దు. పదేళ్ల నుంచి ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చారు. కేసీఆర్ ఆడే ఆటను ప్రదలందరూ గుర్తించాలి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుతే పోటీ చేస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు సహకరించుకుంటున్నాయి. ఎంఐఎం కూడా ఆ పార్టీలకే సహకరిస్తోంది. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో 50-60 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు..? బీజేపీ-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు ఒక్కటే. భారత్ జోడో యాత్ర చేసిన రాహులును ఒవైసీ ఎందుకు విమర్శిస్తున్నారు..?’ అని ఆమె వ్యాఖ్యానించారు.

 

*కాంగ్రెస్‌ది సుతి లేని సంసారం.. ఎవరికి వాళ్లే నాయకులు
సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్ లకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. అదే.. బీఆర్ఎస్ మీటింగ్ లకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలి అంటున్నారు.. మార్పు అంటే 24 గంటల కరెంట్ కాకుండా మూడు గంటల కరెంటా అని విమర్శించారు. ఈ రోజు డీకే శివకుమార్ మళ్ళీ తెలంగాణకి వచ్చారు.. మూడు గంటల కరెంట్ చాలు అనేవాళ్ళు కాంగ్రెస్ కి ఓటేయండని మంత్రి హరీష్ రావు అన్నారు. రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటు గుద్దండి మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపద మొక్కులు మొక్కుతున్నారని విమర్శించారు. వంద అబద్దాలాడైన అధికారంలోకి రావాలని చూస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం కావాలన్న ఢిల్లీకి పోవాలని తెలిపారు. కాంగ్రెస్ ది సుతి లేని సంసారం…ఎవరికి వాళ్లే నాయకులు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస చేతిలో రాష్ట్రం పడితే కుక్కలు చింపిన విస్తరిలా పరిస్థితి అవుతుందని మంత్రి తెలిపారు. ప్రతాప రెడ్డి ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటాడో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

*ప్రధానమంత్రి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం… బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు. బీసీల నాయకత్వం ఉన్న తెలంగాణ రావాలని పవన్ కోరారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన తెలిపారు. మరోవైపు.. అన్యాయం జరిగుతే తిరగబడతామని పవన్ కల్యాణ్ అన్నారు. 2004 నుంచి నేమొరీ శంకర్ గౌడ్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి నాతో పోరాటంలో పాల్గొన్నారని అక్కడి ప్రజలనుద్దేశించి తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ రావాలని కోరారు. నాకు జన్మనిచ్చింది ఆంధ్రా అయినా.. పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటానని పవన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే మరణించిన గద్దర్ అన్న మరణం తనను చాలా బాధించిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. శ్రీశైలంలో యురేనియం తవ్వకాలపై ఉద్యమం చేసామని అప్పటి రోజులను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ నాగర్ కర్నూలు ప్రయాణం రద్దు చేసుకున్నారు. తాండూర్ సభ వేదిక నుంచి పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్ గెలిపించాలని పిలుపునిచ్చారు. తాండూర్ ప్రజలకు సమస్య వస్తే.. ఆ సమస్యపై రోడ్డుపైకి వచ్చి పోరాటం చేద్దామని పవన్ కల్యాణ్ అన్నారు.

 

*పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్
ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పంథా మార్చి వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టార్గెట్ గా వ్యూహం, శపదం అనే రెండు సినిమాలు చేసిన వర్మ వ్యూహం సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి మాత్రమే ఏమాత్రం వెనుకాడడం లేదు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపికి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పలుచోట్ల జనసేన అభ్యర్థులను సైతం బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ బిజెపి – జనసేన కూటమికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్న రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఇంతకంటే దారుణమైన, అసలు ఏమాత్రం ఆసక్తి లేని, అజాగ్రత్తతో కూడిన ప్రచారాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నాడు, అతను మాట్లాడుతున్న మైక్ సౌండ్ గురించి అతను పట్టించుకోవడం లేదు సరి కదా నిర్వాహకులు కూడా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో పోలిస్తే బర్రెలక్క చాలా బెటర్ గా ప్రచారం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి రాంగోపాల్ వర్మ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని రాంగోపాల్ వర్మ కామెంట్ చేయడంతో పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ గత ప్రచారాల వీడియోలు చూస్తుంటే ఆయన ప్రచారానికి రావడం ఆర్గనైజర్లకు ఏమాత్రం ఇష్టం లేదేమో అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. ఇక బర్రెలక్కగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కర్నె శిరీష తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ అనే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకపోవడంతో తన తల్లి కొనిచ్చిన బర్రెలు కాస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. అయితే అదే వీడియో ఆమె మీద కేసు నమోదు అయ్యేలా కూడా చేసింది. అయితే ఆమె బరిలోకి దిగడంతో ఆమెకి ఇప్పుడు అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది.

 

*క్యాష్ ఫర్ క్వేరీ కేసులో మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ ప్రారంభం..
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుంది టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు వెల్లడైంది. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలతోఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల లోక్‌పాల్ మహువా మోయిత్రాపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా మహువాపై సీబీఐ విచారణ ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విచారణ ఆధారంగా ఎంపీపై క్రిమినల్ కేసు పెట్టాలా..? వద్దా..? అనేది సీబీఐ నిర్ణయించనుంది. ప్రాథమిక విచారణలో సీబీఐ ఒక నిందితుడిని అరెస్ట్ చేయదు, కానీ సోదాలు నిర్వహించవచ్చు, సమాచారాన్ని కొరవచ్చు, పత్రాలను పరిశీలించవచ్చు దీంతో పాటు మహువా మోయిత్రాను ప్రశ్నించవచ్చు. లోక్‌పాల్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీబీఐ, నివేదికను ఆ సంస్థకే ఇవ్వనుంది. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగింది. దీని కోసం ఆమె వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు దర్శన్ హీరానందనీ పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్‌కి సమర్పించిన అఫిడవిట్‌లో డబ్బులు ఇచ్చినట్లు వెల్లడించారు. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్కి లేఖ రాశారు. ఆమె లాగిన్ వివరాలను ఇతర వ్యక్తులతో పంచుకుందని ఐటీ మినిష్టర్‌కి ఫిర్యాదు చేశారు. అయితే మొదటి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ దీనిపై ఇటీవల స్పందించారు. కావాలనే ప్లాన్ చేసి మహువాను పార్లమెంట్ నుంచి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆమెకే ప్లస్ అవుతుందని, ఆమె విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయని అన్నారు.

 

*ఇజ్రాయిల్‌కి సహకరించిన ముగ్గురిని బహిరంగంగా ఉరితీసిన పాలస్తీనా..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తుల్కర్మ్‌లో హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు హంజా ముబారక్(31), అజం జుబ్రా(29) అని ఇజ్రాయిల్‌కి చెందిన ఎన్12 వార్తా ఛానెల్ గుర్తించింది. జెనిన్‌లో మూడో వ్యక్తిని హతమార్చినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. మీరు దేశద్రోహులు, మీరు గూఢాచారులు అంటూ గుంపు నినాదాలు చేస్తుండగా, వీరిని ఉరితీశారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రసంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడానికి అవసరమైన సమాచారాన్ని ముగ్గురు వ్యక్తుల ఇజ్రాయిల్ సైన్యానికి ఇచ్చారని ఉరితీశారు. ఇజ్రాయిల్ సైన్యానికి సాయం చేసినందుకు తమకు డబ్బలు అందినట్లు ఓ వ్యక్తి వీడియో రికార్డింగ్‌లో ఒప్పుకున్నాడు. ఇన్‌ఫార్మర్లకు, దేశద్రోహికి ఎలాంటి రక్షణ ఉండదని, మా యోధుల హత్యల్లో ఎవరి ప్రమేయమైనా ఉందని రుజువైతే అతడికి వెంటనే మరణశిక్ష విధిస్తామని రెసిస్టెన్స్ సెక్యూరిటీ అనే సంస్థ ఉరిశిక్షల గురించి వ్యాఖ్యానించింది. అక్టోబర్7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. దాదాపుగా 1200 మందిని క్రూరంగా చంపేశారు. మరో 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది పైగా పాలస్తీనియన్లు మరణించారు. తాజాగా ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజుల పాటు ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న 50 మంది బందీలను విడుదల చేయనుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.

Exit mobile version