ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’:
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నవంబర్ 26న ఆల్ ఇండియా రేడియోలో 107వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వికలాంగులు కూడా బీజేపీ.. ఏఎంపీ మీడియా సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని వింటారు. దానితో పాటు నాయకులు కూడా హాజరుకానున్నారు.
రాజస్థాన్‌లో బంపర్ ఓటింగ్:
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగగా.. అనేక చోట్ల అర్థరాత్రి వరకు క్యూలో నిల్చున్న ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. 74.13 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మేర్‌లోని పోఖ్రాన్‌లో 87.79 శాతం, తిజారాలో 85.15 శాతం ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా మార్వార్ జంక్షన్‌లో 61.10 శాతం, అహోర్‌లో 61.19 శాతం నమోదైంది.
రేపు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు:
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. నవంబర్ 27న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు బాబు హాజరవుతారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు బాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి రిసెప్షన్‌కు హాజరుకానన్నారు.
హైదరాబాద్‌లో రాహుల్ ఆకస్మిక పర్యటన:
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే రాహుల్ శనివారం రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ లో పర్యటించారు. నగరంలోని ముషీరాబాద్, అశోక్‌నగర్‌లో పర్యటించిన రాహుల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు నిలిచిపోయిన ఘటనలపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20:
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తిరువనంతపురంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలో 200 లకు పైగా లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. ఇదే ఊపులో ఇంకో మ్యాచ్ గెలిచేయాలని చూస్తోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అంచనాలను మించిపోయినా.. బౌలింగ్ మాత్రం తేలిపోయింది. దాంతో రెండో టీ20లో బౌలర్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది.
దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా?:
కార్తీక మాసంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారు. అదే దీపాలను నీటి ప్రవాహం ఉన్న దగ్గర దీపాలను వదులుతారు. అలా సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి ఈ పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన నమశివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. ఇలా చెయ్యడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నీటిలో దీపాలను వదులుతారు.
కోటి దీపోత్సవం నేటి విశేష కార్యక్రమాలు:
కార్తిక మాసంలో ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే కోటి దీపోత్సవం 13వ రోజుకు చేరింది. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ దీపయజ్ఞం వేదికగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు భక్తులచే శివ పరివారానికి కోటి బిల్వార్చన చేయించనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.