Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3
భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఈ చంద్ర మిషన్ 2019 సంవత్సరం చంద్రయాన్ 2 తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ మిషన్‌లో, శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చంద్రయాన్-2’ మిషన్ సమయంలో చివరి క్షణాల్లో ల్యాండర్ ‘విక్రమ్’ మార్గం విచలనం కారణంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయలేకపోయింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్ట్ ఎల్వీఎం3ఎం4 రాకెట్‌తో శుక్రవారం అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ రాకెట్‌ను గతంలో GSLVMK3 అని పిలిచేవారు. భారీ పరికరాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నందున అంతరిక్ష శాస్త్రవేత్తలు దీనిని ‘ఫ్యాట్ బాయ్’ అని కూడా పిలుస్తారు. ఆగస్టు చివరిలో ‘చంద్రయాన్-3’ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ప్లాన్ చేయబడింది. ఈ మిషన్ విజయవంతమైతే అటువంటి ఘనత సాధించిన అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ వంటి దేశాల క్లబ్‌లో భారతదేశం చేరుతుంది. ‘చంద్రయాన్-3’ కార్యక్రమం కింద ఇస్రో చంద్రుని ఉపరితలంపై ‘సాఫ్ట్-ల్యాండింగ్’, చంద్ర భూభాగంలో రోవర్ రొటేషన్‌ను దాని చంద్ర మాడ్యూల్ సహాయంతో ప్రదర్శించడం ద్వారా కొత్త సరిహద్దులను దాటబోతోందని అంతరిక్ష సంస్థ తెలిపింది. స్వదేశీ ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 మిషన్ అంతర్-గ్రహ మిషన్‌లకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం.. ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ముందు మంగళవారం (జూలై 11) శ్రీహరికోటలో 24 గంటలకు పైగా సాగిన ప్రయోగ తయారీ, ప్రక్రియ అంతా చూసేందుకు ‘లాంచ్ డ్రిల్’ నిర్వహించారు.

*ఏపీ, తెలంగాణ ఎన్నికలు..! అప్పుడే బెట్టింగ్‌ల జోరు..
తెలంగాణ రాజకీయాలపై బెట్టింగ్ రాయుళ్లు.. అప్పుడే పందేలు మొదలుపెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీని పెంచేశాయి. తెలంగాణలో ఎన్నికల హీట్ వచ్చేసిందనే టాక్ మొదలైంది. దీంతో పందెం రాయుళ్లు.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై బెట్టింగ్ లు కట్టడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లోనే కాదు..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా పందేలు కాస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీనికి తోడు బిజెపి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికార పార్టీ కూడా టెన్షన్ లోకి వచ్చిందన్న ఫీలింగ్ కనబడుతోందన్న చర్చ జరుగుతోంది. వీటన్నిటితో తెలంగాణలో గెలిచేది ఎవరు అనే అంశంపై బెట్టింగ్ కాస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కు 65 సీట్లు వస్తాయని కొందరు బెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై అనూహ్యంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 45 సీట్లు వస్తాయని కొందరు, 35 నుంచి 40 సీట్లు వస్తాయని మరికొందరు పందెం వేస్తున్నారు. ఎక్కువమంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 40 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని లక్షల్లో బెట్ చేస్తున్నారు. ఇక బీజేపీ 12 సీట్లలోపే పరిమితం అవుతుందని కాయ్ రాజా కాయ్ అంటున్నారు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుచే బెట్టింగ్ కాస్తున్నారు. ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగి చూసే ధోరణిలో బెట్టింగ్ కడుతున్నారు. ఎన్నికలకు ఐదారునెల ముందే ఇలాంటి బెట్ కాస్తే… ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపైనా బెట్టింగ్ మామూలుగా లేదు. పొత్తులు కుదరలేదు, తెలంగాణతో పోలిస్తే సమయం ఇంకా చాలా వుంది…అయినా ఏపీపైనా ఒక రేంజ్ లో బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 75 నుంచి 81 సీట్లు వస్తాయని పందెంరాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. అలాగే టీడీపీకి 65 నుంచి 70 స్థానాలు వస్తాయని పందెం వేస్తున్నారు. జనసేనకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని బెట్టింగ్ కు సై అంటున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హీట్ పెరగడంతో, బెట్టింగ్ జోరు కూడా మొదలైపోయింది.

*తెలంగాణకు వర్షసూచన
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం కురుస్తుంది. రేపు హనుమకొండ, జనగాం, వరంగల్, మంచిర్యాల, ములుగు, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 16 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 115.4, అశ్వారావుపేటలో 102.4, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 113.2, నిజామాబాద్ జిల్లా నందిపేటలో 86, నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 84.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో పర్యాయం కొనసాగుతుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపాతం లోటు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

*దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. చెట్టుకు వేలాడదీసి..
మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా ఆ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. గ్రామాల్లో తిరుగుతూ వస్తువులు అమ్మే బాలికపై యువకులు కన్నేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ యువతి ఇంటికి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

*ఒక వారంలో 700కు పైగా రైళ్లు రద్దు
భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూలై 7 – జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 300 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. నీటి కారణంగా 600 మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 500 ప్యాసింజర్ రైళ్లు దెబ్బతిన్నాయని రైల్వే తెలిపింది. దేశంలోని వాయువ్య రాష్ట్రాలు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో జూలై 8 నుండి వరుసగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా, అన్ని నదులు, కాలువలు పొంగిపొర్లాయి. దీని కారణంగా ఈ రాష్ట్రాల రాకపోకలు కష్టంగా మారాయి. రైలు-రోడ్డు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే 300 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే 100 రైళ్లను ఆపాల్సి వచ్చింది. దీంతో పాటు 191 రైళ్లను దారి మళ్లించారు. 67 రైళ్ల దూరాన్ని తగ్గించారు. నీటి ఎద్దడి కారణంగా ఉత్తర రైల్వే 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. 28 రైళ్లు దారి మళ్లించబడ్డాయి, 56 రైళ్లు షార్ట్-ఆర్జినేటెడ్, 54 రైళ్లను షార్ట్-టర్మినేట్ చేయాల్సి వచ్చింది. ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్‌లోని సిర్హింద్-నంగల్ డ్యామ్, చండీగఢ్-సనేహ్వాల్, సహరన్‌పూర్-అంబలా కాంట్ సెక్షన్‌పై భారీ వర్షాలు, వరదల కారణంగా రైళ్లను తాత్కాలికంగా రద్దు/మళ్లింపు/షార్ట్ టర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర రైల్వే పత్రికా ప్రకటన విడుదల చేసింది.

*ఫ్రాన్స్‌లో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్నారు. పారిస్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఫ్రాన్స్‌కు తనకు మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి బంధం ఉందన్నారు. ఈ సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అలయన్స్ ఫ్రాంకైస్ సభ్యత్వం తీసుకున్నప్పుడు ప్రధాని 40 ఏళ్ల సభ్యత్వ కార్డును ప్రస్తావించారు. ఫ్రాన్స్‌తో అనుబంధం చాలా కాలంగా ఉందని, ఎప్పటికీ దానిని మర్చిపోలేనని ప్రధాని మోడీ అన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ప్రారంభమైంది. ఆ కేంద్రంలో మోడీ తానే మొదటి సభ్యుడని, అదే సభ్యుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను అన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆ సభ్యత్వ కార్డు జీరాక్స్ ఇచ్చిందని, నేటికీ అది తనకు వెలకట్టలేనిదని అన్నారు. అలయన్స్ ఫ్రాంకైస్ అనేది విదేశాలలో ఫ్రెంచ్ భాష, సంస్కృతిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పురాతన సంస్థ. ఇది ఫ్రాన్స్ అవగాహన, ప్రశంసలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది 1860లో అహ్మదాబాద్‌లో స్థాపించబడింది. దేశానికి దూరంగా ఉన్నప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదం వింటే, ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. భారతీయులమైన మనం ఎక్కడికి వెళ్లినా, ఖచ్చితంగా మినీ ఇండియాను తయారు చేస్తాం. భారతదేశ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశం చేస్తున్న కృషి పరిధి చాలా పెద్దది. భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’, భారతదేశం ‘వైవిధ్యం నమూనా’ కూడా. ఇదే మన గొప్ప శక్తి, బలం అని అన్నారు. 10 ఏళ్లలో ప్రపంచంలో 10 నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని ప్రధాని మోడీ అన్నారు.

*మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. పలు దేశాల భౌగోళిక పరిస్థితులు, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వ లాంటి పరిణామాలతో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఏదేమైనా బంగారం వ్యాపారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే మహిళలకు బిగ్ షాక్ ఇస్తూ.. ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జులై 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 పెరిగింది.

 

*యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈజీ పేమెంట్స్..!
కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువ చేస్తున్నారు..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్లతో అగ్రస్థానం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదో ఒక యూపీఏ వాడుతున్నారు. అందులో ఎక్కువగా వినిపించే పేరు గూగుల్ పే. ఈ పేమెంట్ యాప్ వాడుతున్న వారికి అదిరే గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే..బ్యాంక్ సంబంధిత సమస్యల నుంచి ప్రతి విషయంలో ఫెయిల్యూర్స్ కాకుండా యూజర్లు రోజు వారీ చిన్న చిన్న లావాదేవీలు చేసుకునేందుకు ఈ యూపీఐ లైట్ తీసుకొచ్చింది ఆర్‌బీఐ. ఇప్పుడు ఈ ఫీచర్‌ను తమ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది గూగుల్ పే. ఇకపై గూగుల్ పే యూజర్లు ఎలాంటి పిన్ అవసరం లేకుండానే రోజు వారీ సరుకులు, స్నాక్స్ మొదలగు కొన్నిటికి ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని తెలుస్తుంది..గూగుల్ పే యూజర్లు యూపీఐ లైట్ అకౌంట్ ద్వారా ఒకసారి రూ.200 వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఈ పేమెంట్స్ చేసేందుకు ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ లేట్ అనేది యూజర్ల బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటుంది. రియల్ టైమ్‌లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానంలో లేకపోయినా ఈ ఫీచర్ పని చేస్తుంది.

 

*చరిత్ర సృష్టించనున్న యశస్వి జైస్వాల్!
విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగిన యశస్వి.. ఇప్పటికే సెంచరీ చేసి చేశాడు. 350 బంతుల్లో 14 ఫోర్లుతో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ అండగా నిలుస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మంచి షాట్లతో అలరిస్తున్న యశస్విపై ప్రశంసల వర్షం కురుస్తోంది. యశస్వి జైస్వాల్‌ శతకం చేయడంతో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రంలో సెంచరీ చేసిన 17వ బ్యాటర్‌గా నిలిచాడు. అతిపిన్న వయసులో టెస్టుల్లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా, నాలుగో ఆటగాడిగా రికార్డులను నమోదు చేశాడు. అయితే 143 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్విని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదే.. టెస్టు డెబ్యూలో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచే అవకాశం. ఇప్పటివరకు టెస్టు అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ లేడు. ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. భారత్ తరఫున డెబ్యూలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ (187) ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ మరో 57 పరుగులు చేస్తే.. భారత్ తరఫున అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా ఎనిమిదవ ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు ఆర్ఈ ఫోస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1903లో ఆస్ట్రేలియాపై ఫోస్టర్ 287 రన్స్ బాదాడు. ఎల్జీ రోవ్ (214), డీఎస్బీపీ కురుప్పు (201), ఎంఎస్ సింక్లైర్ (214), జేఏ రుడాల్ఫ్ (222), కేఆర్ మేయర్స్ (210), డీపీ కాన్వే (200) ఈ జాబితాలో ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023 సీజన్‌లో రాణించడంతో పాటు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్న అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 ఆడే భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే తుది జట్టులో చోటు దక్కలేదు. విండీస్‌ టూర్‌కు ఎంపిక కావడమే కాకుండా.. ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తాచాటాడు.

Exit mobile version