NTV Telugu Site icon

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నేడు నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ‘తెలంగాణ మెడికల్ డే’ నిర్వహించనున్నారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 24 జిల్లాల్లోని గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల పంపిణీ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. తృతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, బస్తీ, గ్రామీణ డిస్పెన్సరీలతో సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ భవనంలో ఎనిమిది అంతస్తులు ఉంటాయి. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉండగా, కొత్త భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుంది. ఇటీవల శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక నిమ్స్‌లో 3,700 పడకలు ఉంటాయి. నిమ్స్ ఎంసీహెచ్ పనులను వేగవంతం చేసి, పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌కు ఇరువైపులా 1000 పడకలతో కూడిన నిమ్స్‌తో పాటు టిమ్స్‌ ఆసుపత్రుల విస్తరణ జరిగింది. హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో నూతనంగా నిర్మిస్తున్న నిమ్స్‌ బ్లాక్‌కు నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భూమిపూజ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి హరీశ్ రావు నిమ్స్ ను సందర్శించారు. నిమ్స్‌లో శంకుస్థాపన కార్యక్రమం అంతా సజావుగా జరిగేలా చూడాలని ఈ సమీక్షలో హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రూ.1571 కోట్లతో చేపట్టనున్న ఈ బ్లాక్‌లో మొత్తం 2000 పడకలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తున్నారు. నిమ్స్‌ విస్తరణ ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని, అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

*నేడే హైదరాబాద్ కు అమిత్ షా.. దర్శక ధీరుడు రాజమౌళితో భేటీ..!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే అయిత్ షా పర్యటనలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు. అలాగే హీరో ప్రభాస్ తో కూడా అమిత్ షా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉన్నాయి. రాజమౌళి నివాసంలో 11.45 నుంచి 12.15 వరకు ఉండనున్నారు. 12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం భద్రాచలంకు వెళ్లనున్నారు. ఉదయం 4 గంటల నుంచి 4.40 వరకు శ్రీరాముల వారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుండి ఖమ్మంకి వెళ్లనున్నారు అమిత్ షా. సాయంత్రం 5.40- 5.55 వరకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 6-7 గంటల వరకు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. 7.10 నుంచి 7.40 వరకు ఖమ్మం గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7.40కి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లి.. అక్కడ నుంచి గుజరాత్ వెళ్లనున్నారు అమిత్ షా. రేపు (15)న ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనాల్సిన అమిత్ షా.. ఒక్కరోజు ముందే వస్తున్నారు. తన పర్యటనలో పలువురు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులను కలిసిన విషయం తెలిసిందే. మరి ఈసారి పర్యటనలో రాజమౌళి, ప్రభాస్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తుండగా.. మరికొందరిని కలుస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో అమిత్ షా ఎవరెవరిని కలుస్తారో అన్న అంశం ఆసక్తిగా మారింది.

*భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్
భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో ఏకకాలంలో 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పలు కంపెనీల్లో బినామీగా ఉన్నట్లు సమాచారం. అతను 15 కంపెనీలలో పెట్టుబడిదారుడు. ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

*డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మరోసారి అరెస్ట్
డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. హవాలా, మనీలాండరింగ్ కేసులో వెంకటరామి రెడ్డిని ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. రుణాల ఎగవేత ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో రూ. ఆయనపై ఉన్న 3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. డీసీ వెంకట్రామి రెడ్డి వివిధ బ్యాంకుల నుంచి 8,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని మళ్లీ కట్టడంలో విఫలమవడంతో ఈడీ దాడులు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. మంగళవారం డీసీ వెంకట్రామిరెడ్డి, గతంలో సీఈవోగా పనిచేసిన మణి అయ్యర్‌లను కూడా పిలిపించి విచారించారు. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా పిలిపించారు. ఈ ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్‌కు పంపనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2015లో ఫిబ్రవరి 15లో కూడా డక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌ వెంకట్రామి రెడ్డిని బెంగళూరు సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు డాక్యుమెంట్లతో వెంకట్రామి రెడ్డి తమను రూ.357 కోట్ల మేర మోసం చేశారంటూ సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఫిర్యాదుపై విచారణ జరిగింది ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం అరెస్టు చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి అరెస్టు సరికాదని, ఒప్పందం పోరాడుతామని డెక్కన్ క్రానికల్ పేర్కొంది.

*నేటి నుంచే పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్‌ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది. జనసేన శ్రేణులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కటౌట్స్, జెండాలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం కన్నుల పండగలా ఉంది. కత్తిపూడి మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది. మంగళగిరిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన యాగం మంగళవారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిసింది. పూర్ణాహుతితో యాగం సంపూర్ణమైంది. యజ్ఞ జలంతో రుత్వికులు పవన్‌ కల్యాణ్‌కు పుణ్యస్నానం చేయించి, ఆశీర్వదించారు. యాగం అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌తో పాటు పార్టీ నేతలకు వైద్య సేవల నిమిత్తం జనహిత అంబులెన్స్‌ కూడా సిద్దమైంది. లైఫ్ సపోర్ట్‌ వెహికిల్‌లో డాక్టర్‌, వైద్య సిబ్బంది ఈ యాత్రలో ఉంటారు.

*పట్టాలు తప్పిన రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
విశాఖపట్నం సమీపంలోని తాడి రైల్వే స్వేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్‌ దెబ్బతింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేయగా.. వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్‌కు మరమ్మత్తులు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

*ప్రమాదకరంగా మారుతున్న బిపర్ జోయ్ తుఫాన్
అరేబియా మహాసముద్రంలో బిపర్‌జోయ్‌ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బిపర్‌జోయ్‌ మంగళవారం అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుపానుగా బలహీనపడిందని ఐఎండీ తెలిపింది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతో పాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15 సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని కనిపిస్తుంది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్‌ జిల్లాల్లో ఈనెల 13– 15 తేదీల మధ్య అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ‘రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది.ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు. తీరాన్ని దాటిన తుఫాను బలహీనపడి, తన గమనాన్ని దక్షిణ రాజస్తాన్‌ వైపు మార్చుకుంటుందని సూచించింది. దీని ప్రభావంతో ఈనెల 15–17 తేదీల్లో ఉత్తర గుజరాత్‌లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది. బిపర్‌జోయ్‌ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలోకి గుజరాత్‌ ప్రభుత్వం తరలించినట్లు పేర్కొనింది. తుఫాను సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే కాండ్లా పోర్టును మూసివేశారు. అక్కడ పనిచేసే 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన్సుఖ్‌ మాండవీయ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.

 

*తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి అరెస్ట్
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలోని ఆయన ఆఫీసులో.. కోయంబత్తురు, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.. దాదాపు 18 గంటల పాటు మంత్రిని ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సెంథిల్ బాలాజీ భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లభించడంతో ఇవాళ ఉదయం ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఛాతినొప్పి అంటూ ఒక్కసారిగా మంత్రి సెంథిల్ బాలాజీ కూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశ కనిపిస్తుంది. తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు. మంత్రులు ఉద‌య‌నిధి స్టాలిన్, సుబ్రమణ్యం, ఎవ వేలు, రఘుప‌తి, శేఖ‌ర్ బాబు త‌దిత‌రులు ఆసుప‌త్రికి వెళ్లి ఆయన ప‌రామర్శించారు. ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మంత్రి మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కారులో పడుకుని నొప్పితో సెంథిల్ బాలాజీ ఏడుస్తూ కనిపించాడు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ తమిళనాడులో హాట్ టాఫిక్ గా మారింది.

 

*జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం
ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. కశ్మీర్‌లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌‌, హర్యానా, పంజాబ్‌, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూకంప తాకిడికి జమ్ముకశ్మీర్‌లో పలు ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దోడాలోని ఓ సబ్‌ డిస్ట్రిక్‌ హాస్పిటల్‌లో రోగులకు గాయాలయ్యాయి. ఈనెల 11న 3.2 తీవ్రతతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో, జూన్‌ 9న కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాలు సంభవించినప్పటి వీడియోలను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

*సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇకపై ‘యోగా బ్రేక్’..
కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లోని తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్‌లు ఉండేవి.. కానీ.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ను కూడా తీసుకురావటంతో ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తప్పకుండా వాడుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ జీవోను జారీ చేసింది. పని చేసే ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని పునరుత్తేజం పొందేందుకు వీలుగా ఆఫీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని పేర్కొనింది. నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం.. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులు పడుతుంటారు. వీటి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు ఆఫీసుల్లోని కుర్చీలో యోగా చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు. అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వేయాలనే అనుమానం కొందరు ఉద్యోగులకు రావొచ్చు.. అలాంటి వారికోసం, కార్యాలయాల్లో ఎలాంటి ఆసనాలు వేసేందుకు వీలుందో తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్‌లను మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది శిక్షణ , వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన యూట్యూబ్ లింక్ లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విదివిధానాలు ఉంటాయని తెలిపింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు సూచించింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది.

 

*దారుణం..పడవ బోల్తా పడటంతో 103 మంది మృతి..
సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోరం జరిగింది..ఘోర పడవ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో 103 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 103 మంది మరణించారు. ఉత్తర మధ్య నైజీరియా లో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న అతిథుల పడవ నీట మునిగింది.. ఈ ప్రమాద సమయంలో 200 మందికి పైగా ప్రయానిస్తున్నారని, మొత్తం నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఒకేసారి అంత మంది చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.. ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.. గతంలో కూడా చాలానే వెలుగు చూసాయి..  ఈ ఘోర ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదు. నైజర్ స్టేట్‌లోని వివాహ వేడుక నుంచి క్వారా రాష్ట్రం లో ప్రజలను తీసుకువెళుతుండగా నది లో పడవ మునిగిపోయిందని, అన్వేషణ కొనసాగుతోందని చెబుతున్నారు.. ఈ ప్రమాద సమయం లో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వలన, వర్షాకాలంలో భారీ వరదల కారణంగా నదిలో పడవ బోల్తాపడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. అందుతున్న సమాచారం మేరకు.. పడవ ప్రమాదం లో 103 మంది మరణించారని,మరో 100 మందిని రక్షించామని క్వారా రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మి అజయ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం పోలీసులు మృతి చెందిన వారిని వెలికి తీసే పనిలో ఉన్నారు.. నైజీరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం గమనార్హం. ఇక్కడి ప్రజలు తరచుగా స్థానికంగా తయారైన ఓడలను ఉపయోగిస్తారు, దీని కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గత నెలలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌లోడ్‌ కారణంగా పడవ బోల్తా పడి 15 మంది పిల్లలు మునిగిపోయారు.. మరో 25 మంది కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ఇక వరుస ప్రమాదాలు జరిగితున్న కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోలేదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..