NTV Telugu Site icon

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను ఫోటోగ్రఫీ ద్వారా వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘హైదరాబాద్ ఆన్ వీల్స్’ బస్సులో పులుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గుతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సామాజిక బాధ్యతగా ఈ పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను వివరించనున్నారు. ఈ ప్రదర్శనలో, TSRTC ICBM-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డీన్ (అకడమిక్స్) వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గోవిందనీ తీసిన పులి ఫోటోలను ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ ఆవరణలో ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ బస్సులో పులి ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) రాకేష్‌ మోహన్‌ డోబ్రియాల్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్ (ఐపిఎఫ్), ఐసిబిఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ సహకారంతో టిఎస్‌ఆర్‌టిసి నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో పులుల ఛాయాచిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో పులుల ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు రాకేష్‌ మోహన్‌ డోబ్రియాల్‌ తెలిపారు. తెలంగాణ అటవీశాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రెండు పులుల సంరక్షణ కేంద్రాల్లో దాదాపు 30 పులులు ఉన్నట్లు చెబుతున్నారు. అడవుల్లో నివసించే పులుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని సమస్త జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నట్లు వివరించారు.

 

*నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్‌కుమార్‌ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్‌ నరసింహా రావు, టీజీ వెంకటేశ్‌, విష్ణువర్ధన రెడ్డి తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు.శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం 10గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుచానూరు రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని చిత్తూరు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమౌతారు.సాయంత్రం 3.40 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.4.30 నుంచి 5.40గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి వెళ్తారు.

*తీవ్రరూపం దాల్చనున్న బిపర్‌జోయ్‌ తుఫాన్
బిపర్‌జోయ్ తుఫాన్ ఉత్తర-ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది. మరో మూడు రోజుల్లో తుఫాను ఉత్తర వాయువ్య దిశగా దూసుకుపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ భారత దేశంలో మోస్తరుగా-అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కేరళ, కర్ణాటక తీరప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, లక్షద్వీప్‌లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయి. కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎనిమిది జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్ మరియు కన్నూర్ ఉన్నాయి. రుతుపవనాలు దక్షిణ భారత రాష్ట్రానికి గురువారం వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ కంటే ఏడు రోజులు వెనుకబడిందని IMD తెలిపింది. బిపర్జోయ్ తుఫాను కారణంగా ద్వీపకల్పంలో నెమ్మదిగా పురోగతితో..వాతావరణ వ్యవస్థ ప్రారంభం బలహీనంగా ఉండవచ్చని హెచ్చరించినప్పటికీ, వాతావరణశాఖ తెలిపింది. జూన్ 15 తర్వాత మాత్రమే వర్షపాతం పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ భారతదేశం-ఈశాన్య ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం కొనసాగుతుంది. ఇది రాబోయే రెండు రోజులలో భారీ వర్షంగా మారే అవకాశం ఉంది. అయితే రానున్న 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది.

*జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు శివ భక్తులతోపాటు సాధారణ భక్తులు రానున్నారు. మంచు కారణంగా యాత్రను నిలిపివేయగా.. తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఏడాది నిర్వహించిన అమర్‌నాథ్ యాత్రలో 3.45 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్‌, పహల్‌గామ్‌ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్‌ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు నిర్ణయించింది. పవిత్ర మంచు లింగానికి నమస్కరించడానికి, భక్తులు జూన్-ఆగస్టు నెలలలో కాశ్మీర్ హిమాలయాలలో ఉన్న పవిత్ర గుహ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రను నిర్వహిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం 2000లో జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటైన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డుచే నిర్వహించబడుతుంది. రాష్ర్ట లెఫ్టినెంట్ గవర్నర్ పుణ్యక్షేత్రం బోర్డు ఛైర్మన్‌గా వ్యవహారిస్తారు.

*పార్లమెంటు సభ్యత్వానికి బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను అని పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడారు. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను.. ఇది నాకు చాలా గౌరవప్రదమైనది అని ఆయన పేర్కొన్నారు. పార్టీగేట్ కుంభకోణం దర్యాప్తు నివేదిక తర్వాత.. అతను UK ఎంపీ పదవికి రాజీనామా చేసిశాడు. కరోనా సమయంలో అతను లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడు. జాన్సన్ యూకే పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేశారని కూడా ఆరోపించారు. బోరిస్ జాన్సన్ 2022లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, ఆయన ఎంపీ పదవిలో కొనసాగుతున్నారు. అయితే పార్టీగేట్ కేసులో ప్రివిలేజెస్ కమిటీ విచారణ నివేదిక రావడంతో ఆయన ఎంపీ పదవికి రిజైన్ చేశారు. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు తనపై చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నాననీ, అందులో స్పష్టంగా పేర్కొన్న ప్రివిలేజెస్ కమిటీ నుంచి తనకు లేఖ అందిందని జాన్సన్ చెప్పుకొచ్చారు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు.. హౌస్ ఆఫ్ కామన్స్ గౌరవాన్ని జాన్సన్ కించపరిచారని ప్రివిలేజెస్ కమిటీ పేర్కొనింది. కమిటీ అన్ని వేళలా సభ విధి విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. విచారణ నివేదికను త్వరలో విడుదల చేస్తామని.. అంతకంటే ముందు సోమవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రివిలేజెస్ కమిటీకి లేబర్ ఎంపీ హ్యారియెట్ హర్మాన్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో బ్రిటన్ కూడా దాని పట్టులో పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా నిబంధనలను ఉల్లంఘించారు. అతను 10 డౌనింగ్ స్ట్రీట్ లో మద్యం పార్టీ చేసుకున్నాడు.

*ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్న రష్యా
ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్‌ దేశంతో చర్చలు జరిపి అంగీకరింప చేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఖకోవ్కా ఆనకట్ట కూల్చివేత అనంతరం మాస్కోపై క్షిపణుల దాడుల కారణంగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తంగా మారింది. దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేశారు. జులై 7-8 తేదీల్లో బెలారస్‌లో అణ్వాయుధాలను మోహరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇదరు దేశాల అధ్యక్షులు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో రష్యా అధ్యక్షులు వ్లాదిమీర్‌ పుతిన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం పుతిన్‌ ప్రకటన జారీ చేశారు. తాము ఏది చేసిన ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తామన్నారు. చేయాలనుకున్నది స్థిరంగా చేస్తామని సమావేశం అనంతరం పుతిన్‌ ప్రకటన చేశారు. రష్యా అధీనంలో ఉండే భూ ఉపరితలం నుంచి స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే అణ్వస్త్ర క్షిపణులను బెలారస్‌లో మోహరించాలని గతంలోనే ఇరు దేశాధ్యక్షులు నిర్ణయించారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లాలంటే నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ కీలకం. రెండు దేశాలకు మధ్య ఉన్న కీలకమైన డ్యామ్‌ను పేల్చి వేశారు. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. దాదాపు 60 వేల మంది వ‌ర‌ద ముంపులో ఉన్నట్లు తేలింది. డ్యామ్ కూలిపోవ‌డానికి నువ్వంటే నువ్వే కార‌ణ‌మ‌ని ఉక్రెయిన్‌, ర‌ష్యాలు ఆరోపించుకుంటున్నాయి. డ్యామ్‌ను పేల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధ వాతావరణం మరింత పెరిగింది. అందుకే అణ్వాయుధాలతో బలంగా ఉన్న రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి దిగనుంది.

*వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మాత్రమే సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్య తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంతరిక్షం సినిమాలో మళ్లీ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ తమ ప్రేమను గోప్యంగా ఉంచుతున్నారు. తమ రిలేషన్ షిప్ గురించి వచ్చిన వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంధీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు కొత్త దర్శకుడితో ఎయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవల పులిమేక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ-5లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. గతేడాది హ్యాపీ బర్త్ డే సినిమాతో అలరించింది.

*మూడోరోజు 300 ఆధిక్యానికి చేరువలో ఆసీస్..
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్లను త్వరగా ఔట్ చేశారు. 8 బంతుల్లో 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డగౌట్ కి పంపించాడు. ఉమేశ్ యాదవ్‌కి ఈ మ్యాచ్‌లో ఇదే తొలి వికెట్.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 47 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 27 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ బౌలింగ్‌లోనే అవుట్ కావడం విశేషం. 111 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ 118 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు, కామెరూన్ గ్రీన్ 27 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరినీ నాలుగో రోజు త్వరగా అవుట్ చేసినా ఆ తర్వాత అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఈజీగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి 400 పరుగుల టార్గెట్ పెట్టేలా కనబడుతుంది. అదే జరిగితే టీమిండియా బ్యాటర్లపై కొండంత భారం పెట్టినట్లు అవుతుంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 151/5 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రీకర్ భరత్‌, మొదటి సెషన్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు.. అయితే వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా మూడో రోజు మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసిన టీమిండియా పూర్తి డామినేషన్ కనబర్చింది. అయితే 89 పరుగులు చేసి సెంచరీ వైపు సాగుతున్న అజింకా రహానే, లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్ వికెట్ కూడా భారత జట్టు కోల్పోయింది. ఇక 51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, ఓవల్‌లో వరుసగా మూడో 50+ స్కోరు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ అవుటైన వెంటనే మహ్మద్ షమీ కూడా పెవిలియన్ చేరడంతో 300 మార్కుకి 4 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.