*నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక గడ్డకి ఒక చరిత్ర ఉంది.. దుబ్బాకకి రావాల్సిన నిధులు ఆనాడు కేసీఆర్ సిద్దిపేటకి తీసుకెళ్లారు.. కేసీఆర్ తో కొట్లాడి దుబ్బాకకి నిధులు తెచ్చిన ఘనత దివంగత ఎమ్మెల్యే ముత్యం రెడ్డిది.. ఈనాడు హరీష్ రావు కూడా దుబ్బాక నిధులు సిద్దిపేటకి తీసుకెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు. దుబ్బాకకి వచ్చిన ఆస్పత్రులు, కాలేజీలు రద్దు చేసి మామా అల్లుళ్లు సిద్దిపేటకి తీసుకు వెళ్లారు.. దుబ్బాక ఉప ఎన్నికలో వాళ్ల బంధువు గెలవాలని బీజేపీ అభ్యర్థిని గెలిపించారు.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అది చేస్తా ఇది చేస్తా అని రఘునందన్ రావు అన్నారు.. రఘునందన్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు..ఆయనకి ఓటు అడిగే హక్కు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ వాళ్లే బండి సంజయ్ పై ఆరోపణలు చేసుకుంటూ పార్టీ కుమ్ములాటలు తప్ప ఇక్కడ ఏం చేయ్యలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త కానీ అది పాత చింతకాయ పచ్చడి.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే కేసీఆర్ కి ఎందుకు నొప్పి అంటూ విమర్శించారు. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఊర్లు తిరుగుతూ కేసీఆర్ వగల ఎడుపులు ఏడుస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. నేను బక్కోన్ని..కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారు అంటున్నారు.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓ పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ దుబ్బాకని బంగారు తునక లాగా చేస్తా అన్నారు.. పదేళ్లు అయ్యింది దుబ్బాకని బొందల గడ్డ చేశారు.. కేసీఆర్ మందేసి మట్లాడుతున్నాడో మతి పోయి మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు.. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగదు.. ఎవరికి డబుల్ బెడ్ రూమ్ రాలే కానీ పక్కనే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ కి 4 వేల పెన్షన్ ఇస్తానన్నారు.. కేసీఆర్ కి డబుల్ బెడ్ రూమ్ చర్లపల్లి జైలులో కట్టిస్తాం.. కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
*మరో అల్పపీడనం..! మూడు రోజులు వర్షాలు
ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం & పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తాయని.. రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషానికి వస్తే ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. మరోవైపు.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మరోవైపు రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఇక, రేపు మరియు ఎల్లుండి అయితే, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ
బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆమె వెల్లడించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ అని మాయావతి విమర్శలు గుప్పించారు. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రజలను విజ్ఞప్తి చేశారు.
*బటన్ నొక్కిన సీఎం జగన్.. వారి ఖాతాల్లో సొమ్ము జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో పథకం డబ్బులను విడుదల చేశారు.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈ రోజు రిలీజ్ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. ఈ దఫాలో 10,511 జంటలకు సంబంధించిన రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని.. వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది ఏపీ ప్రభుత్వం.ఇక, బటన్ నొక్కి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమని, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు కళ్యాణమస్తు, షాదీ తోఫా అందించామని తెలిపారు. పేదింటి పిల్లలు విద్యావంతులు కావాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకానికి 10వ తరగతి అర్హతలు పెట్టాం.. దీంతో బాల్య వివాహాలు తగ్గుతాయని తెలిపారు.. పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్ చేయడం ఈ పథకం లక్ష్యంగా చెప్పుకొచ్చారు.. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరగా.. 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్ జగన్ సర్కార్ అందించిన మొత్తం సాయం 349 కోట్ల రూపాయలు కాగా.. 46 వేల మందికి లబ్ధి పొందారు.
*జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చా..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లాలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన తెలంగాణలో ధర్మ యుద్ధం చేద్దామని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. నిధులు, నియామకాలు, నీళ్లపై తెలంగాణ ఉద్యమం జరిగిందని.. ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బంది పడ్డ నల్గొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో అందరికి సమానత్వం నినాదంతో పాలన సాగుతుందన్నారు. జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుందని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అడపడుచుల ఆదృశ్యం ఎక్కువైంది, మహిళలపై ఆగడాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బండెనక బండి కట్టి అని గజ్జెకట్టి పాడిన గద్దర్ స్పూర్తితో సమానత్వ సమాజం కోసం పాటుపడదామన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఆ దిశగా జనసేన కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యువత పోరాట స్పూర్తితో ఆంధ్రాలో పోరాటం చేస్తున్నామన్నారు. జన్మనిచ్చిన తెలంగాణాకు సేవ చేయాలనే వచ్చానన్నారు. మనస్ఫూర్తిగా ఘన స్వాగతం పలికింది మద్దతుదారులంతా బీజేపీ ఆభ్యర్ధుల గెలుపు కోసం పాటుపడాలని ఆయన సూచించారు.
*టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు కానీ సీఎం అవుతా అంటున్నారని.. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎంలు ఉన్నారు అని ఆయన విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారని.. రాకపోతే దేనికంటే దానికి సిద్ధం అంటున్నారని మంత్రి హరీష్ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా రేవంత్ ఇలానే అన్నాడు.. కొడంగల్‌లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు.. అక్కడికి వెళ్లి నేను ఓ మీటర్ పెడితే బోర్లాబొక్కల పడ్డాడు.. మరి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోలేదని మంత్రి హరీష్ ప్రశ్నించారు. ఉత్తమ్ కాంగ్రెస్ గెలవకపోతే నేను గడ్డమే తీయను అన్నారని.. కేసీఆర్ 88 సీట్లతో గెలిస్తే ఇద్దరు మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి మేకపోతు గాంబిర్యాలు అంటూ మంత్రి హరీష్ విమర్శలు గుప్పించారు.
*”పనౌటీ” వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..
ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ‘పనౌటీ’(చెడు శకునం) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అక్కడికి వెళ్లడం వల్లే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. మన ఆటగాళ్లు దాదాపుగా వరల్డ్ కప్ గెలిచారు, కానీ చెడు శకునం వల్ల ఓడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలతో ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుస్తోందని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు పంపింది. ఈ నెల 25న రాజస్థాన్ లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మరోమారు అధికారంలోకి రావాలని అనుకుంటుంటే, బీజేపీ కాంగ్రెస్‌ని గద్దె దించాలని ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలు, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వంటి వారు ప్రచారం చేస్తున్నారు.
*మహువా మోయిత్రా వివాదం.. పార్లమెంట్ లాగిన్ నిబంధనలు మార్పు..
మహువా మోయిత్రా వివాదం దేశం అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీ కేసుగా పిలువబడుతున్న ఈ వివాదంలో ఇప్పటికే ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. మెజారిటీ ప్యానెల్ ఆమెను ఎంపీ పదవి నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు అభియోగాలు మోయిత్రాపై వచ్చాయి. దీంతో పాటు ఆమె తన పార్లమెంట్ లాగిన్ వివరాలను కూడా ఇతరులతో పంచుకున్నట్లు వెల్లడైంది. మహువా ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు వెల్లడైంది. లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను ఇతరులకు ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంట్ వెబ్‌సైట్ యాక్సెస్ చేసే నిబంధనలను గురువారం మార్చారు. ఇకపై ఎంపీల పీఏలు, కార్యదర్శులు డిజిటల్ సంసద్ పోర్టల్, యాప్స్ యాక్సెస్ చేసే వీలు ఉండదు. సభల్లో ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు బయటకు రాకూడదని లోక్ సభ డాక్యుమెంట్ పేర్కొంది. థర్డ్ పార్టీ డిజిటల్ సంసద్ వెబ్సైట్ యాక్సెస్ చేయలేరు. ఎంపీల తరుపున నోటీసులు ఇవ్వడం కానీ, ప్రశ్నలను అడగటం కానీ చేయలేరు. ఎంపీలు మాత్రమే తమ లాగిన్ వివరాలు ఉపయోగించి సైట్ యాక్సెస్ చేయవచ్చు. ఓటీపీ ఎంపీల రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్లకు మాత్రమే వస్తాయి, వారు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే వెబ్సైట్ యాక్సెస్ అవుతుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారిగా మహువా మోయిత్రాపై ఆరోపణలు చేస్తూ, ఆమె వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుని ప్రధాని మోడీని, అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగినట్లు, వారిపై విచారణ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. దీంతో పాటు ఆమె లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు ఆరోపించారు. అయితే తాను లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మోయిత్రా కూడా ఒప్పుకున్నారు, అయితే ప్రశ్నలను టైప్ చేయడానికి మాత్రమే వివరాలు ఇచ్చానని, ఓటీపీ నాకే వస్తుందని గతంలో తెలిపారు.
*ఈమే నా హీరో.. 97 ఏళ్ల బామ్మ సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా
97 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకాశంలో ఎగరాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరిగ్ అనే ఇన్‌స్టా పేజ్ బామ్మ వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బామ్మ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రానే సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో ఈ బామ్మ వీడియో షేర్ చేస్తూ నా హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతకి ఆ బామ్మ చేసిన సాహసం ఏంటంటే.. ఈ బామ్మ ప్లయింగ్ రైనోలో ద్వారా ఆకాశాన్ని చూట్టోచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ అనే తమిళ సాంగ్ ప్లే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ సాగిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టకుంటోంది. 97 ఏళ్ల వయసులో బామ్మ ఆకాశంలో ఎగిరేంత సాహసం చేయడం చూసి ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆమె గుండె ధైర్యానికి ఫిదా అవుతూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఆనంద్ మహీంద్రా సైతం బామ్మ సాహసానికి ఫిదా అయ్యారు. దీంతో బామ్మ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎగరాడానికి ఇది ఎప్పటికి ఆలస్యం కాదు.. ఈ రోజుకు ఈమే నా హీరో’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అద్బుతమైన వీడియో’, ఈ బామ్మ గుండె ధైర్యానికి సెల్యూట్’ ‘అనుకున్నది సాధించడానికి వయసు అడ్డు కాదని ఈ బామ్మ ప్రూవ్ చేశారు’ అంటూ కామెంటస్ చేస్తున్నారు.
*24 గంటలుగా ఎన్‌కౌంటర్.. పాక్ కీలక ఉగ్రవాది హతం..
జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు. ఐఈడీ తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు అడవుల్లో గుహల్లో దాక్కోవడం వంటి వాటితో పాటు స్నైపర్ శిక్షణ ఇవ్వడంలో ఖారీ పేరుపొందినట్లు సైన్యం తెలిపింది. ఖారీ పాకిస్తాన్, ఆఫ్ఘన్‌లో శిక్షణ పొందారు. లష్కరేతోయిబాలో అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద నాయకుడిగా ఉన్నాడు. గత ఏడాది కాలంగా ఖారీ తన ఉగ్రవాద బృందంతో రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో క్రియాశీలకంగా ఉన్నాడు. డాంగ్రీ, కంది దాడుల్లో ఇతను ప్రధాన సూత్రధారి. బుధవారం జబిమల్ గ్రామంలోని స్థానిక గుజ్జర్ వ్యక్తి, ఉగ్రవాదులకు ఆహారం నిరాకరించాడు, దీంతో అతనిని ఉగ్రవాదుల కొట్టారు. ఈ విషయాన్ని అతను భద్రతాబలగాలకు చెప్పడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో భారీ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించకోకుండా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. సైనికులు చుట్టుముట్టడంతో సీనియర్ ఆర్మీ కమాండర్లు ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలు భావించినప్పటికీ.. వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన సైనికుల్లో, ముగ్గురు ప్రత్యేక దళాల కమాండోలు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ లో కమాండింగ్ ఆఫీసర్, ఆర్మీ మేజర్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ మరణించారు. రాజౌరీ-పూంచ్ పీర్ పంజాల్ అటవీ ప్రాంతం 2003 నుంచి తీవ్రవాదం నుంచి బయటపడింది. అయితే 2021 నుంచి మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 30 మంది ఆర్మీ జవాన్లు మరనించారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉంటున్నాయి. దీంతో ఆపరేషన్ చేసేందుకు వెళ్లిన సైన్యానికి ఈ ప్రాంతంలో ఎదురుదెబ్బలు తాకుతున్నాయి.
