Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*ఎలక్షన్‌ ఎప్పుడొచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటాం..
ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని.. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 20 వేల కోట్ల అప్పులు చేసి, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని ఆరోపించారు. ఆ అప్పులన్నీ మేము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని తెలిపారు మంత్రి కారుమూరు నాగేశ్వర రావు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

 

*నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.ఇందుకోసం ఒక్కోచోట మెడికల్ కాలేజీకి 222, బోధనాస్పత్రికి 484 చొప్పున కొత్తగా 2,118 పోస్టులను సృష్టించగా.. పోస్టులను మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్‌ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా.. అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్‌ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్‌ నరసింహం చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. ఇదిలా ఉండగా.. వర్షాకాలంలోనూ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. మురుగు/వరద నీరు మళ్లింపు కాలువల తవ్వకం, బ్రిడ్జిలు, పైపు కల్వర్టుల పూడికతీత, రోడ్లు, నీటిపారుదల కాలువ వెంబడి మొక్కలు నాటడం, కొండలపై నుంచి పారే వర్షపు నీరు నిల్వకు వీలుగా ట్రెంచ్‌ల నిర్మాణం వంటి 23 రకాల పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తించింది. ఇప్పటికే అనుమతి ఉన్న పనులతో పాటు ఈ పనులను కూలీలకు అప్పగిస్తారు.

 

*తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం ఖరారైంది. కొత్త జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలతో సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రానున్నారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో రాష్ట్రంలో ఖాళీ ఏర్పడింది. మరోవైపు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. గుజరాత్‌కు సునీతా అగర్వాల్,బాంబేకి దేవేంద్రకుమార్, మణిపూర్‌కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్ర నియమితులయ్యారు.

 

*అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య
ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. అయితే ఆ ఆశలన్నీ నిరాశనే మిగిల్చాయి. కొన్నినెలలు ఆనందంగా సాగిన వారిజీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నంకోసం భర్త మానసికంగా.. శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పుట్టింటి వారికి చెబితే బాధపడతారని చెప్పలేక నరకయాతన పడింది. భర్తతో పాటు అత్తమామ తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేక సహకోల్పోయిన వధువు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారికి పుట్టెడు దుఖం మిగిల్చింది. ఈఘటన మైలార్ దేవ్‌పల్లిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవ వధువు కవిత ఆత్మహత్య కలకలం రేపింది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్ కు చెందిన చంద్ర శేఖర్ తో వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజులకే తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు వేధింపులకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పొటి మాటలు ఎక్కువయ్యాయి. సహనం కోల్పోయిన కవిత తనువు చాలించాలని అనుకుంది. గదిలోకి వెళ్లి ఫ్యాన్‌ కు ఉరివేసుకుని బలవన్మరణంకు పాల్పడ్డ కవిత. ఎంతసేపు గది నుంచి కవిత రాకపోయే సరికి భర్త చంద్ర శేఖర్ వెళ్లి చూడగా కవిత ఫ్యాన్‌ కు వేళాడుతూ కనిపించింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన అత్తింటి వారు కవిత కుటుంబానికి కవిత చనిపోయినట్లు కాల్‌ చేసి చెప్పారు. షాక్‌ కు గురైన కవిత తల్లిదండ్రులు హుటా హుటిన కవిత అత్తింటి చేరుకున్నారు. కవిత విగత జీవిగ పడిఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. కవిత ఎలా చనిపోయిందంటూ ప్రశ్నించారు. మొన్నటి వరకు బాగున్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని నిలదీశారు. భర్త, అత్తింటి వారు ఏమీ చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు నలుగురిపై 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఇంటికి మల్కాజ్గిరి డిసిపి చేరుకున్నారు. కవిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిత గురించి అడిగి తెలుసుకున్నారు.

 

*వాడు మూత్రం పోశాడు.. సీఎం కాళ్లు కడిగాడు
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని పరామర్శించాడు. శివరాజ్ బాధితురాలికి క్షమాపణలు చెప్పడమే కాకుండా కాళ్లు కడిగి తన బాధను వ్యక్తం చేశాడు. ఇటీవల సిద్ధి వీడియో వైరల్ అయ్యింది. అందులో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజన బాధితుడి పాదాలను కడిగి, తన మనస్సు చాలా చలించిపోయిందని అన్నారు. బాధితుడి పేరు దశరథ్, అటువంటి పరిస్థితిలో సీఎం అతని నుండి అతని కుటుంబం గురించి కూడా సమాచారం తీసుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దశరథ్‌ను సుదామ అని పిలిచారు. తనను తాను స్నేహితుడని పిలిచారు. సిద్ధి జిల్లాలోని గిరిజన యువకుడిపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేశాడని, దీని వీడియో వైరల్‌గా మారింది. ప్రవేశ్ శుక్లాను కూడా మంగళవారం రాత్రి అరెస్టు చేశారు, దీనిపై సెక్షన్ 294, 594 కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అంతే కాదు నిందితులపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

 

*ఇప్పుడే కొనేయండి.. బియ్యం రేట్లు పెరగబోతున్నాయ్
దేశంలో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న వార్త అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ బియ్యం ధరల్లో గత 11 ఏళ్లలో గరిష్ఠ స్థాయి కనిపించడంతో ఇప్పుడు భారత్‌లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావంతో ప్రధాన వరి ఉత్పత్తిదారుల ముందు తక్కువ దిగుబడి వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా పేద ఆసియా, ఆఫ్రికా దేశాలలో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని మొత్తం బియ్యం ఉత్పత్తిలో భారతదేశం వాటా 40 శాతం.. 2022 సంవత్సరంలో భారతదేశం బియ్యం ఎగుమతి 56 మిలియన్ టన్నులు కావడం గమనించదగ్గ విషయం. అయితే, ఇప్పుడు దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండటం దాని ఎగుమతులు తగ్గడానికి కారణం కావచ్చు. బియ్యం రిటైల్, టోకు ధరలు పెరగవచ్చు. రైస్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బివి కృష్ణారావు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక నివేదిక ప్రకారం.. గత సంవత్సరం వరకు భారతదేశం చౌకగా బియ్యం ఉత్పత్తి చేసేది. ఇప్పుడు దేశంలో కొత్త కనీస మద్దతు ధర వచ్చినందున, భారతీయ ధరల పెరుగుదల ప్రభావం ఇతర బియ్యం సరఫరాదారులపై కూడా వస్తోందని.. వారు ధరలను పెంచుతున్నారు. బియ్యం ఆసియాలో సుమారు 3 బిలియన్ల మంది ప్రజలు తింటారు. ఇది నీటి ఆధారిత పంట, ఇది ఆసియాలో సమృద్ధిగా ఉత్పత్తి చేయబడుతుంది… అంటే దాదాపు 90 శాతం. ఈ సంవత్సరం ఎల్-నినో నమూనాల కారణంగా.. తక్కువ వర్షపాతం ముప్పు ఉంది. ఇది వరి వంటి నీటి సమర్థ పంటకు మంచి సంకేతం కాదు. ప్రతికూల వాతావరణం ఉత్పత్తిపై ప్రభావం చూపకముందే ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకోవడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గ్లోబల్ రైస్ ధరల సూచిక ప్రకారం.. ఈ సంఖ్య వచ్చింది.

 

*కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న ధర నేపథ్యంలో టమాటా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తోటలోని టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే జూలై 4వ తేదీ రాత్రి హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లి గ్రామంలోని రూ. 2.5 లక్షల విలువై టమాటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించాడు. బెంగళూర్ లో కిలో టమాటా రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్ తరలించాలని యోచిస్తున్న సమయంలో తన 2 ఎకరాల్లోని టమాటాలను దొంగిలించారని మహిళా రైతు ధరణి తన ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంటతో భారీ నష్టాలు చవిచూసి టమాటా సాగు చేశామని.. పంటను పండించేందుకు అప్పులు చేశానమి.. మాకు మంచి పంట చేతికొచ్చే సమయానికి దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50-60 బస్తాల టమాటాను తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు ధరణి చెప్పారు. దీనిపై హళేబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐపీసీ) సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఎండల తీవ్రత, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా పంట దెబ్బతింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో టమాటాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలుత ఎండల తీవ్రత, వర్షాలు సకాలం కరవకపోవడంతో పాటు ఇటీవల కాలంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో టమాటా డిమాండ్, సప్లైకి మధ్య తేడా వచ్చింది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో టమాటా రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.

 

*పాక్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ వర్షం.. 30ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతినగా, రోడ్లు చెరువులుగా మారాయి. బుధవారం ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశం నుంచి కురిసిన ఈ విపత్తు కారణంగా ఏడుగురు చనిపోయారు. వీరిలో వర్షపు నీటిలో మునిగి మరణించిన చిన్నారి కూడా ఉన్నారు. దీంతో పాటు విద్యుత్ షాక్‌తో ముగ్గురు, ఇంటి పైకప్పు పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. పంజాబ్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్‌లోని వాతావరణ శాఖ ఇప్పటికే భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పాకిస్తాన్‌లో గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పరిస్థితి ఉంటుందా అనేది అతిపెద్ద ప్రశ్న. గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదలు పాకిస్థాన్‌లో భారీ విధ్వంసం సృష్టించాయి. సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లో మూడింట ఒక వంతు నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో 1700 మంది మరణించారు. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాదు, 10 లక్షలకు పైగా ఇళ్లు కొట్టుకుపోగా దాదాపు 90 లక్షల పశువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. గతేడాదిలాగా ఉండకూడదని అనేక సన్నాహాలు చేసినా ఈసారి కూడా భారీ వర్షాలు పాలకులకు నిద్రలేని రాత్రులనే ఇచ్చాయి. పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలకు సహాయం చేయడానికి ఎమర్జెన్సీ నంబర్లు జారీ చేశామని ఇమ్రాన్ ఖురేషీ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో యంత్రాలు, భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా పరిస్థితిని గమనిస్తున్నారు. సహాయక బృందాలను వెంటనే సమీకరించాలని పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రిని ఆయన ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.

 

*సలార్‌ పార్ట్‌-1.. ‘సీజ్‌ఫైర్‌’ అంటే ఏంటో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా కేజీయఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‌’. పృథ్వీరాజ్‌ సుకుమార్‌, శ్రుతి హాసన్‌, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్‌ టీజర్‌ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ టీజర్‌తో సలార్‌ సినిమాపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అంచనాలను పెంచేశారు.’వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌’ అనే ఒక్క డైలాగ్‌తో కేజీయఫ్‌-2 ట్రైలర్‌ విడుదల చేసి అంచనాలు పెంచిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. సలార్‌ విషయంలోనూ అదే ఫాలో అయ్యాడు. ఒకే ఒక్క ఇంగ్లీష్‌ డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం కానీ.. జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ..’ అంటూ ప్రభాస్‌ను ఎలివేట్‌ చేశారు. అయితే టీజర్‌లో ప్రభాస్ ఫేస్ కూడా క్లియర్‌గా కనిపించకపోవడం, ఎలాంటి డైలాగ్స్‌ లేకపోవడంతో అభిమానులకు మింగుడుపడడం లేదు.సలార్‌ సినిమా రెండు భాగాలుగా రానుందని టీజర్‌ ద్వారా స్పష్టత వచ్చింది. ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ (Salaar Part 1: Ceasefire) అని టీజర్‌లో పేర్కొన్నారు. ఈ సీజ్‌ ఫైర్‌ ఏంటి (Ceasefire Meaning) అని అందరూ గూగుల్‌లో వెతుకుతున్నారు. సీజ్‌ ఫైర్‌ అంటే.. కాల్పుల విరమణ లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్ర కాల్పులు జరిగినప్పుడు లేదా అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకోవడాన్నే ‘సీజ్‌ ఫైర్‌’ అంటారు. మరి సినిమాలో ప్రభాస్‌ సీజ్‌ ఫైర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version