NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*లిఫ్టులో చిక్కుకున్న మంత్రి రజనీ, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
ఏపీ మంత్రి విడదల రజనీకి ప్రమాదం తప్పింది. తాజాగా ఏపీ మంత్రి విడదల రజనీ లిఫ్టులో చిక్కుకున్నారు. ఏపీ మంత్రి విడదల రజినీతో పాటు లిఫ్టులో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు కూడా లిఫ్టులో చిక్కుకున్నారు. ఓవర్ లోడ్ అవ్వడంతో కొద్దీ నిమిషాల పాటు లిఫ్ట్ నిలిచిపోయింది. అయితే ఎమర్జెన్సీ కీ ద్వారా లిఫ్ట్‌ను సిబ్బంది ఓపెన్‌ చేశారు. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి కాసేపు ఇబ్బంది పడ్డారు. ఇవాళ మంత్రి రజనీ విశాఖ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో జర్నలిస్టుల కోసం వైద్య పరీక్షల కేంద్రం ప్రారంభించారు. ఈ తరుణంలోనే మంత్రి విడదల రజనీ లిఫ్టులో చిక్కుకున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు బాబు-ఆనం భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఆయనను టీడీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నెల 13 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. లోకేష్ పాదయాత్ర నాటికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం చేరికపై క్లారిటీ రానుంది. నెల్లూరులో లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ఆనం వివేకా కుమారుడు ఆనం రంగమయూరి రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనం రాంనారాయణరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన అనంతరం ఏ పార్టీలో చేరతారనే సందేహం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలను గమనిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కీలక నేతలు ఆనం, కోటంరెడ్డిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి.

*ఈ ఏడాది 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరం లో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలిక ను ఖరారు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తుందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటి వి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర 2014 తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందన్నారు. బియ్యం ఎగుమతులు 109శాతం పెరిగాయన్నారు. వంట నూనెలు దిగుమతి తగ్గించామని తెలిపారు. రైతుల నుండి నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలిక ను ఖరారు చేసిందని గుర్తు చేశారు. యూరియా ఒక బస్తా పైన 2 వేల 236 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుందని అన్నారు. Dap ఒక బస్తా పైన 2422 రూపాయల సబ్సిడీ ఇస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఒక ఎకరా ఉంటే ఏడాది కి 18 వేల 612 రూపాయల సబ్సిడీ రైతుకు లభిస్తుందని తెలిపారు. 10 ఎకరాలు ఉంటే రైతుకి ఎరువుల సబ్సిడీ ఏడాదికి లక్ష 86 వేల 120 రూపాయలు లభిస్తుందని అన్నారు. తెలంగాణ లో 39 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిది అందుతుందని స్పష్టం చేశారు. ఎరువుల మీద 27 వేల కోట్ల సబ్సిడీ తెలంగాణ రైతులకు కేంద్రం అందించిందని అన్నారు. ఎరువుల కొరత లేకుండా చేసిందని గుర్తు చేశారు. పాడి,మత్స్య పరిశ్రమల కు చేయూత నిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలం గుజరాత్‌లోని వాద్‌నగర్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం సందర్శించిన విషయం తెలిసిందే.. పురాతన పట్టణం యొక్క గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చే “అనంత్ అనాది వాడ్‌నగర్” డాక్యు-సిరీస్ ప్రదర్శనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వాద్‌నగర్‌లోని రైల్వే స్టేషన్ మరియు ఇతర పురాతన ప్రదేశాలను సందర్శించారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేకతను చాటేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పురాతన పట్టణం మరియు దాని గొప్ప చరిత్ర. ఇందులో భాగంగా అనంత్ అనాది వడ్ నగర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 2700 సంవత్సరాల నుండి వాద్‌నగర్‌లో ప్రజలు నివసిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక పట్టణం వాద్‌నగర్‌ను భారతదేశంలోని మథుర, ఉజ్జయిని, పాట్నా, వారణాసి వంటి చారిత్రక జీవన నగరాలతో పోల్చవచ్చన్నారు.

*పారాసిటమాల్‌తో సహా 14 డ్రగ్స్‌పై నిషేధం
దేశంలో పారాసిటమాల్‌తో పాటు మరో 14 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాలను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని పేర్కొంటూ మందులపై నిషేధం విధించింది. ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులను.. కొన్ని ఫిక్స్‌డ్ డోసేజ్ కాంబినేషన్‌లలో కలపడం. మొదటిసారి కలిపితే అది కొత్త మందు నిర్వచనం కిందకు వస్తుంది. ప్రజారోగ్యానికి అనుకూలం కానీ లేదా సహాయపడని అనేక మందులు మిక్స్ డ్‌ డోస్ కాంబినేషన్‌గా విక్రయించబడుతున్నాయఅని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అందుకే అటువంటి వాటిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. CDSCO (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) పనితీరుపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. సీడీఎస్‌సీవో అనుమతి లేకుండా కొన్ని రాష్ర్టాల లైసెన్సింగ్ అధికారులు చాలా పెద్ద సంఖ్యలో FDCల తయారీకి లైసెన్స్‌లను జారీ చేసినట్లు గమనించింది. ఇదే నివేదికను తన 59వ నివేదికలో పార్మెంటరీ కమిటీ ప్రకటించింది. అలా సీడీఎస్‌సీవో అనుమతి లేకుండానే మార్కెట్‌లోకి అనేక FDCలు అందుబాటులోకి వచ్చాయని. వాటిని సమర్థత మరియు భద్రత కోసం పరీక్షించబడలేదని మరియు అవి రోగులను ప్రమాదంలో పడేస్తుందన్నారు. దేశంలోని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్‌లను వారి రాష్ట్రం/యూటీల్లోని FDCలను వారు తయారు చేసి మందుల యొక్క నాణ్యత మరియు సమర్థతను సీడీఎస్‌సీవో ముందు18 నెలల వ్యవధిలో నిరూపించమని కోరవలసిందిగా సీడీఎస్‌సీవో కోరింది. అలా నిరూపించుకోలేకపోతే.. అటువంటి FDCలు మందులను తయారు చేయడానికి నిషేధించబడతాయని.. అలాగే వాటి మందుల మార్కెటింగ్‌ను నియంత్రించబడుతుందని స్పష్టం చేసింది.

*గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ యూనివర్శిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి మోడీ విద్యార్హతలు తెలియజేయాలంటూ 2016లో అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఒక లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రాజనీతి శాస్త్రంలో మోడీ మాస్టర్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని తెలిపారు. అయితే ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. మోడీ సర్టిఫికెట్ట్ ను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురించాలని ఆయన కోరారు. దీంతో ప్రధాని మోడీ విద్యార్హతను వెల్లడించాలని ప్రధాని కార్యాలయం.. గుజరాత్ యూనివర్సిటీ.. ఢిల్లీ యూనివర్సిటీలను కోరారు సమాచార కమిషనర్. ఈ విషయం కోర్టుకి వెళ్లడంతో గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టేసింది. మోడీకి సంబంధించిన సర్టిఫికెట్లను సీఎంఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాదు కేసు వేసిన కేజ్రీవాల్ కు రూ. 25 వేల జరిమానా విధించింది. అందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ డిగ్రీ పట్టాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్సిటీ చెప్పిందని అయితే విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో అలాంటి డిగ్రీ అసలు అందుబాటులోనే లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేగాక కేజ్రీవాల్ కు విధించిన రూ. 25 వేల జరిమానా విషయంలో కూడా సమీక్షించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవడం కోసం తను ఎలాంటి డిమాండ్ చేయలేదని సాధారణంగా ఒక లెటర్ ను మాత్రమే రాశానని దాన్ని సీఐసీ సుమోటగా స్వీకరించింది అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రివ్యూ పిటిషన్ పై విచారణను గుజరాత్ హైకోర్టు ఈ నెల 30వ తారీఖుకు వాయిదా వేసింది.

*5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో వాహనాలపై నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లక్షలాది మంది వాహనదారులకు ఊరట లభించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. వాహనదారులు ఎలాంటి భయం లేకుండా వెబ్‌సైట్‌లోని వాహన నంబర్ ఆధారంగా వివరాలను సరిచూసుకోవచ్చని వివరించారు. వాహనాలపై నమోదైన ట్రాఫిక్ చలాన్లను మాత్రమే రద్దు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని రకాల ప్రైవేట్ మరియు వాణిజ్య వాహనాలపై విధించిన అన్ని ట్రాఫిక్ చలాన్‌లను జనవరి 1, 2017 నుండి డిసెంబర్ 31, 2021 వరకు రద్దు చేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్ 2023లో 2వ నంబర్ జీవోను విడుదల చేసింది. చలాన్లు నమోదు చేసి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ఇటీవల నోయిడా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం గమనార్హం. ఇక యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ అన్ని ప్రాంతీయ రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసుల జాబితాను కోర్టు ఇచ్చిన తర్వాత.. రవాణా పోర్టల్ నుంచి అన్ని చలాన్లను తొలగించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలోని ప్రైవేట్, వాణిజ్య వాహనదారులకు భారీ ఊరట లభించింది. యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయంపై లక్షలాది మంది వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో చలాన్లకు సంబంధించిన కోట్లాది రూపాయల పెండింగ్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఎవరికీ చలాన్లు చెల్లించేందుకు భయపడవద్దని అధికారులు వాహనదారులకు సూచించారు. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో దరఖాస్తు నింపితే సరిపోతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగానే చలాన్ల వివరాలు తెలుస్తాయని వివరించారు. ఏదైనా వాహనంపై తప్పుడు చలాన్లు విధించినట్లు డ్రైవర్లు గుర్తిస్తే, నేరుగా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వాహనంపై ఉన్న చలాన్‌లను రద్దు చేసిన తర్వాత వాహనదారుడి మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుందన్నారు.

*సాంకేతిక లోపంతో శాన్ ఫ్రాన్సిస్కో-ముంబై విమానం రద్దు
ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయబడింది. బాధిత ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు లేదా చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన ప్రయాణికుల కోసం హోటల్ వసతితో పాటు రవాణా కోసం చేసే అన్ని ఖర్చులను కూడా మేము తిరిగి చెల్లిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యాన్నికి తాము చింతిస్తున్నట్లు విమానాయన సంస్థ పేర్కొంది. అయితే ముంబైకి వెళ్లే విమానాన్ని రద్దు చేయడానికి ముందు ప్రయాణికులు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో చాలా గంటల పాటు వేచి ఉన్నారు. అయితే ప్లైట్ క్యాన్సిల్ కావడంతో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించిన పూర్తి డబ్బును వాపసుగా తిరిగి ఇవ్వలని డిమాండ్ చేశారు. అలాగే ఇదే ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.విమానయాన సంస్థలు ఇలా చేయడం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా అధికారి ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు.

*విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు
అమెజాన్‌ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు స్వదేశీ పిల్లలను సజీవంగా కనుగొన్నారు. వారికి ప్రస్తుతం వైద్య చికత్సను అందిస్తున్నారు. ఇదే అంశంపై దేశాధ్యక్షులు గుస్తావో పెట్రో క్యూబా నుండి బొగోటాకు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందంపై నేషనల్ లిబరేషన్ ఆర్మీ రెబల్ గ్రూప్ ప్రతినిధులతో సంతకం చేశారు. యువకులు మనుగడకు ఉదాహరణ అని అధ్యక్షుడు అన్నారు మరియు వారి కథ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఏడుగురు ప్రయాణికులు మరియు పైలట్‌తో కూడిన సెస్నా సింగిల్-ఇంజిన్ ప్రొపెల్లర్ విమానంలో ప్రయాణించారు. వారి ప్రయాణం ప్రారంభం అయిన కొద్ది సేపటికి ఇంజిన్ వైఫల్యం కారణంగా పైలట్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. మే 1 తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. చిన్న విమానం కావడంతో కొద్దిసేపటి తర్వాత రాడార్ నుండి పడిపోయింది. ప్రమాదం అనంతరం ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకులాట ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న ఒక అన్వేషణా బృందం అమెజాన్‌ వర్షారణ్యంలోని దట్టమైన పాచ్‌లో విమానాన్ని కనుగొంది. విమానంలో ప్రయాణించిన ముగ్గురు పెద్దల మృతదేహాలను కనుగొన్నారు. కానీ చిన్న పిల్లలు ఎక్కడా కనిపించలేదు. కాని వారు సజీవంగా ఉండవచ్చని అధికారులు భావించారు. కొలంబియా సైన్యం పిల్లల కోసం వేటను వేగవంతం చేసింది. తరువాత 13, 9, 4 సంవత్సరాల మరియు 11 నెలల వయస్సు గల నలుగురు తోబుట్టువుల సమూహాన్ని ట్రాక్ చేయడానికి కుక్కలతో 150 మంది సైనికులను ఆ ప్రాంతానికి పంపించింది. స్థానిక తెగల నుండి డజన్ల కొద్దీ వాలంటీర్లు కూడా శోధనలో సహాయం కోరింది. శుక్రవారం సైనికులు మరియు వాలంటీర్ల బృందం థర్మల్ దుప్పట్లతో చుట్టబడిన పిల్లలతో ఉన్న చిత్రాలను సైన్యం ట్వీట్ చేసింది. మా ప్రయత్నాల యూనియన్ దీన్ని సాధ్యం చేసిందని కొలంబియా సైనిక కమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

*నటసింహం బాలకృష్ణ మాస్ ట్రీట్ చూశారా… అదిరిపోయిందిగా
నటసింహం నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో అభిమానులలో ఫుల్ జోష్ ని నింపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలైన కాసేపట్లోనే టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోందనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ లుక్, ఫస్ట్ లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా, ఈ టీజర్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ తో సినిమాలో మ్యూజిక్ ఏ రేంజులో ఉంటుందో ముందే సంకేతాలు పంపాడు. రోజు ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా. దీంతో 108 థియేటర్స్ లో టీజర్ ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో బాలయ్య అభిమానులు భారీగా సందడి చేశారు. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. బాలయ్య అభిమానులు సందడి చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్యను ప్రెజెంట్ చేశాడు. బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, టాలీవుడ్ క్రష్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా కనిపించనుంది. బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా బాలయ్య అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చింది. ‘భగవంత్ కేసరి’ని దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర యూనిట్.

*బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. కారు అద్దాలు పగలగొట్టి..
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా, ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ కారు చోరీకి గురై వార్తల్లో నిలిచారు. బెల్లంకొండ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం ముందు తన బెంజ్ కారును పార్క్ చేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కారు వెనుక అద్దం పగిలి ఉండడాన్ని గమనించారు. దీంతో పరుగున కారుకీసు తీసి పరిశీలించగా అందులో ఉన్న విలువైన వస్తువులు మిస్ అయ్యాయి. ఇందులో రూ. 50 వేల నగదు, 11 కల్తీ మందు బాటిళ్లు బెట్టినట్లు అవి దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. దీంతో భయాందోళన చెందిన బెల్లంకొండ భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పరిశీలించారు. కారులో నగదు, మద్యం బాటిళ్లు ఉండటాన్ని ముందుగా దుండగులు గమనించి ఉంటారని భావిస్తున్నారు. అయితే కారు పార్కింగ్ చేసే సమయంలో అందులోనగదు ఎందుకు పెట్టారు? మద్యం బాటిళ్లు ఎందుకు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ గమనించిన దుండగులు ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కారు పార్కింగ్ చేసిన ప్రాంతంలో సెక్యూరిటీ ఉన్నాడా? ఒక వేళ ఉంటే కారు అద్దాలు పగలకొడుతున్నప్పుడు ఆ చప్పుడు ఎందుకు వినిపించలేదనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.