NTV Telugu Site icon

Hydra Demolitions: హైడ్రా దారితప్పుందా..?

Hydra

Hydra

Hydra Demolitions: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ఏమాత్రం కనికరం లేకుండా కూల్చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. అయితే కొంత మంది బిల్డర్లు.. చెరువులు కబ్జా చేసి అపార్ట్ మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు. బఫర్, ఎఫ్టీఎల్ ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తూన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.

Read Also: 2024 Dussehra Offer: రూ.100 కొట్టు మేకను పట్టు.. దసరాకు బంపర్ ఆఫర్! ఎక్కడో తెలుసా

ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెరువుల్ని కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్య తరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజ్ కు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షేడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. సడెన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని.. నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునే వారమని బాధితులు చెబుతున్నారు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘటనల్లో చెరువు కబ్జా చేసి లీజ్ కు ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అన్యాయం అయిపోయారు.

Read Also: Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..

రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తే.. తన కష్టాన్నంతా ధారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇల్లు కూల్చేయటంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి వాపోతున్న వీడియో తిరుగుతోంది. LKG చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇంటిని, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడలా కూల్చేశారు. హైడ్రా పేరుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా బుల్డోజర్లు పంపుతున్నారని విపక్షాలు విమర్శించే అవకాశం హైడ్రానే ఇచ్చింది.

Read Also: Riya Barde Arrest : మహారాష్ట్రలో బంగ్లాదేశ్‌ పోర్న్ స్టార్ రియా అరెస్టు.. కారణం ఇదే

పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతున్న సర్కారు.. పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోందనే వాదన క్రమంగా బలపడుతోంది. హైడ్రా ఏర్పటైన తొలినాళ్లలో అందరికీ ఒకటే న్యాయమనే సూత్రం అమలైంది. అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానించారు. అంతెందుకు హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ వచ్చిన మంచిపేరుని హైడ్రా కొద్దిరోజులకే పోగొట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఉద్దేశం మంచిదైనా ఆచరణ లోపాలు హైడ్రాను వెక్కిరిస్తున్నాయి. చట్టబద్ధంగా కూల్చివేతలు జరుగుతున్న భావన కలిగించకుండా.. కోర్టు లేని రోజుల్లో హడావుడిగా నోటీసులు, కూల్చివేతలతో అసలు ఉద్దేశం నీరుగారే పరిస్థితి వచ్చింది. ఆక్రమణలు అని పక్కాగా రుజువులుంటే.. కోర్టులు లేనప్పుడు హడావుడి చేయాల్సిన పనేముందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారం ఉందా.. లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఐదేళ్ల క్రితం హైకోర్టు అడిగిన జంట జలాశయాల హద్దులు ఇంతవరకూ ఇవ్వని అధికారులు.. ఇప్పుడు హైడ్రాకు మాత్రం సరైన రికార్డులిస్తున్నారా.. లేదా అనే అనుమానాలూ లేకపోలేదు. రెవిన్యూ, ఇరిగేషన్ రికార్డులకు పొంతన లేదనే వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. హైడ్రా కూడా గూగుల్ మ్యాపుల ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు వస్తున్నాయి.