Site icon NTV Telugu

GST Reforms: కామన్ మ్యానికి భలే రిలీఫ్.. లగ్జరీలకు ఓ రేంజ్‌లో షాక్..!

Gst Reforms

Gst Reforms

GST Reforms: గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్‌వ్యవస్థీకరణకు GST కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్‌ నిర్ణయించింది. అంటే… ఇకపై కనిష్ఠంగా 5 శాతం, గరిష్ఠంగా 18 శాతం పన్ను పడుతుంది. సామాన్యులు, రైతులకు ఊరట కలిగించడమే లక్ష్యంగా GST స్లాబుల్లో మార్పులు చేశారు. సామాన్యులు వినియోగించే హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, షాంపూలు, టూత్‌ బ్రెష్‌లు, టూత్‌ పేస్టులు, టేబుల్‌వేర్‌, కిచెన్‌వేర్‌, ఇతర గృహవసర వస్తువులపై GSTని 5 శాతానికి తగ్గించారు.

ఆల్ట్రా హైటెంపరేచర్‌ పాలు, పన్నీరు, అన్ని రకాల భారతీయ రొట్టెలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తూ GST కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, గతంలో 12, 18 శాతం పన్ను స్లాబులో ఉన్న నమ్కీన్‌, బుజియా, సాస్‌లు, పాస్తా, ఇనిస్టెంట్‌ నూడిల్స్‌ వంటి వాటిని 5 శాతం స్లాబ్‌లోకి తీసుకొచ్చింది. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్టీకల్చర్‌ యంత్రాలు, కల్టివేటర్లు, హార్వెస్టర్లు, త్రెషర్లు, హేమూవర్లపై GST 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. 12 రకాల సేంద్రీయ పురుగుల మందులపై పన్నును 12 నుంచి 5 శాతానికి కుదించారు. వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, నైట్రిక్‌ యాసిడ్‌, అమోనియాపై GST 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ GST కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది GST కౌన్సిల్‌. 33 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను మినహాయిస్తూ GST కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, క్యాన్సర్‌తో పాటు అరుదైన జబ్బుల చికిత్సలో ఉపయోగించే మూడు ఔషధాలపై కూడా GSTని పూర్తిగా మినహాయించారు. సిమెంట్‌పై GST 28 నుంచి 18 శాతానికి తగ్గింది. సొంతిల్లు కట్టుకునే మధ్యతరగతికి ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు నిర్మలా సీతారామన్‌. చేతి వృత్తులు, కార్మికులు తయారు చేసే మార్బుల్‌ బ్లాక్‌లు, మధ్యంత చర్మ వస్తువులపై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గింది. చేనేత రంగానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ సమస్యను పరిష్కరించారు. చేనేత వస్త్రాలపై GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.

ACలు, అన్ని రకాల TVలు, డిష్‌ వాషింగ్‌ మెషీన్లు. చిన్న కార్లు, 350 CC కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్‌ సైకిళ్లు 18 శాతం స్లాబులోకి రానున్నాయి. పునరుత్పాధక ఇంధన రంగానికి చెందిన వస్తువులపైనా GST 12 నుంచి 5 శాతానికి తగ్గింది. బయోగ్యాస్‌ ప్లాంట్‌లు, విండ్‌మిల్స్‌, విండ్‌ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిసిటీ జనరేటర్లు, ఫొటోవాల్టెక్‌ సెల్స్‌, సోలార్‌ కుక్కర్లు, సోలార్‌ వాటర్‌ హీటర్లపై పన్ను తగ్గనుంది. GSTని రెండు స్లాబులకు కుదించినా… అత్యంత విలాస వస్తువులపై ఏకంగా 40 శాతం పన్ను విధించేలా నిర్ణయం తీసుకుంది కౌన్సిల్‌. పాన్‌ మసాలా, సిగరెట్లు, గుట్కా, జర్దా, పొగాకు, బీడీలకు వర్తిస్తుందన్నారు. కూల్‌డ్రింక్స్‌కి కూడా 40 శాతం శ్లాబు కిందకు వస్తాయి. పెద్ద కార్లు, 350 CC కంటే ఎక్కువ సామర్థ్యం గల మోటార్‌ సైకిళ్లు, వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే హెలికాప్టర్లు, విమానాలు, క్రీడా అవసరాలకు వినియోగించే అన్ని రకాల పడవలకు 40 శాతం శ్లాబ్‌ వర్తిస్తుంది.

సామాన్యుడిపై భారం తగ్గించే దిశగా GST కౌన్సిల్‌ సమష్టి నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారన్నారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారామె.

Exit mobile version