Talli Prema : నటరత్న యన్.టి.రామారావు, నటిశిరోమణి సావిత్రి జంటగా అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. వారిద్దరూ సెంటిమెంట్ భలేగా పండించగా రూపొందిన ‘తల్లిప్రేమ’ సైతం ప్రేక్షకులను రంజింప చేసింది. 1968 మార్చి 9న విడుదలైన ‘తల్లిప్రేమ’ చిత్రంలోని కథావస్తువు తరువాతి రోజుల్లో అనేక చిత్రాలకు దారి చూపించింది. శ్రీకాంత్ దర్శకత్వంలో ఆజమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఆజమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘తల్లిప్రేమ’లోని కథ ఏమిటంటే? ప్రెసిడెంట్ కేశవరావు, ఆయన భార్య సీత అన్యోన్యంగా ఉంటారు. కేశవరావు తమ్ముడు వేణు, అతనంటే పిల్లలు లేని ఆ భార్యాభర్తలకు ప్రాణం.ఆ ఊరిలో విశ్వరూపం తన దుకాణంలో ఎక్కువ ధరలు పెట్టి అమ్మేస్తూ జనాన్ని దోచేసుకుంటూ ఉంటాడు. ఆయన భార్య భద్రమ్మ. వారికి ఓ కొడుకు, ఓ కూతురు. వారి అమ్మాయి లలిత, కేశవరావు తమ్ముడు వేణు ప్రేమించుకుంటారు. పిల్లలు లేని గొడ్రాలని భద్రమ్మ ఓ సారి సీతను అంటుంది. దాంతో కుమిలిపోతుంది సీత. వేణు, లలిత పెళ్ళాడతారు. సీత ఎన్నో ఏళ్ళకు దైవానుగ్రహంతో ఓ బిడ్డకు జన్మనిస్తుంది. అదే సమయంలో లలిత కూడా ప్రసవిస్తుంది. కానీ, బిడ్డ బ్రతకదు. దాంతో లలిత ప్రాణం దక్కదని భావించి, తమ బిడ్డనే ఆమె బాబుగా చూపిస్తారు కేశవరావు, సీత. వారి త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. పైగా మామ విశ్వరూపం మాటలతో వేణు తన వాటా తనకు ఇవ్వమంటాడు. కేశవరావు, సీత ఆస్తి వారికే అప్పగించి, ఇల్లు విడిచిపోతారు. ఆ సమయంలో బాబుకు ప్రమాదం జరుగుతుంది. రక్తం అవసరమవుతుంది. వేణు, లలిత రక్తం సరిపోదు. అది తెలిసి సీత తన రక్తం ఇవ్వడానికి వస్తుంది. అప్పుడు కూడా భద్రమ్మ నానా మాటలు అంటుంది. అయితే డాక్టర్ కు అసలు తల్లి సీతనే అని తెలిసి, ఆమె రక్తం ఎక్కిస్తారు. అప్పటికీ నానా మాటలు అంటూ ఉన్న విశ్వరూపం, భద్రమ్మకు డాక్టర్ అసలు విషయం చెబుతుంది. అది విన్న వేణు, లలిత తమ తప్పు తెలుసుకొని సీతను,కేశవరావును క్షమించమని వేడుకుంటారు. మళ్ళీ అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
Read Also: Satish Kaushik: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ మృతి
ఈ చిత్రంలో రామ్మోహన్, పద్మనాభం, నాగభూషణం, కె.వి.చలం, మల్లాది, అతిథి పాత్రలో రేలంగి, కాంచన, గీతాంజలి, ఛాయాదేవి, ఝాన్సీ, ఉదయలక్ష్మి, విజయలక్ష్మి, సబిత తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాత ఆజమ్ కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు పలికించారు. ఆర్.సుదర్శనం సంగీతం రూపొందించిన ఈ సినిమాకు కొసరాజు, దాశరథి, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. ఇందులోని “కొమ్మ మీద కోయిలమ్మ…”, “హలో హలో దొరగారూ…”, “కలలో ఇలలో…”, “తల్లి నిన్ను తలంచి…” అంటూ సాగే పాటలు అలరించాయి.
Read Also: Anupama Parameswaran: సొగసు చూడతరమా.. నీ సొగసు చూడతరమా
‘తల్లిప్రేమ’ రిపీట్ రన్స్ లోనూ మహిళా ప్రేక్షకులను అలరించింది. ఈ కథతో 1971లో శివాజీగణేశన్, పద్మినీ జంటగా తమిళ చిత్రం ‘కులమా గుణమా’ రూపొందింది. 1982లో ఇందులోని ప్రధానాంశాన్ని తీసుకొని కృష్ణ ‘డాక్టర్-సినీయాక్టర్’ తెరకెక్కింది. 1986లో జితేంద్ర, జయప్రద జంటగా హిందీలో ‘స్వర్గ్ సే సుందర్’ గా ఇదే కథ వెలుగు చూసింది. 1991లో ఇదే కథ తెలుగులో మళ్ళీ కృష్ణ, రమేశ్ బాబు హీరోలుగా ‘నా ఇల్లే నా స్వర్గం’గా రూపొందింది.