NTV Telugu Site icon

Supreme Court: నీటి విషయంలో “రాజకీయాలు వద్దు”.. విడుదల చేయాలని సుప్రీం ఆదేశం

Delhi Water

Delhi Water

దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో.. రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా.. సుముఖత చూపించింది. దీంతో.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని.. ఆదేశించింది. హిమాచల్ నుండి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని హర్యానాను కోరింది.

Read Also: Oman Vs Australia: బోణి కొట్టిన ఆసీస్.. ఒమన్ పై భారీ విజయం..

హిమాచల్ నుంచి అందుతున్న నీటిని ఢిల్లీలోని వజీరాబాద్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా హర్యానా ప్రభుత్వం అనుమతించాలని, తద్వారా ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ప్రశాంత్ కె మిశ్రా, కెవి విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ హిమాచల్ అదనపు నీటిని సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపింది. మరోవైపు.. నీటి విషయంలో రాజకీయాలు ఉండకూడదని, నీటిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశం ఇచ్చింది. “భారీ ఎండ తీవ్రత దృష్ట్యా.. ఢిల్లీ తాగునీటికి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. హర్యానాలో కూడా తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, నీటి కొరత లేదు” అని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో నీరు వృథా కాకుండా చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read Also: Kurnool District: కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట

గత నెల రోజులుగా వాయువ్య ప్రాంతంలో తీవ్రమైన వేడిగాలులు వీచడంతో ఢిల్లీ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. నగరంలో ఉష్ణోగ్రతలు 40-50 డిగ్రీల పరిధిలో నమోదయ్యాయి. రాజధాని నగరంలో వడదెబ్బ కారణంగా ఒకరు మరణించారు. ఇదిలా ఉంటే.. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక నెల పాటు అదనపు నీటి సరఫరా చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం గత నెలలో కేంద్రం మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో.. మండుతున్న ఎండలలో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.