Hyderabad Police: హైదరాబాద్‌లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 10.30 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు ప్రకటిస్తున్నారు. రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ పోలీసులు ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటలలోపే పాతబస్తీలో పాన్ షాపులు,హోటళ్లు మూసేయాలని మైక్‌లో పోలీసులు తెలిపారు.
రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు ముక్కుముఖం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గస్తీని పెంచారు. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జరగడంతో కఠినంగా వ్యవహరించాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఆఫీస్‌లు రాత్రి 11 గంటలకు ముగుస్తాయని, ఆ సమయంలో డిన్నర్ ఎక్కడ చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
నో ఫ్రెండ్లీ పోలీస్ ఓన్లీ లాఠీ పోలీస్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్తీలోనే పోలీసులు ఎందుకిలా ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. అదే జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకటనలు పోలీసులు ధైర్యంగా చేయగలరా అంటూ పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలను రాత్రి 12 గంటల వరకు అనుమతించాలని ఆయన కోరారు. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో రాత్రి 12 గంటల వరకు వ్యాపారానికి అనుమతిస్తున్నారని.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిందని ..రాత్రి వ్యాపారాన్ని అనుమతిస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు.