NTV Telugu Site icon

World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఖాళీ స్టేడియంలోనే ప్రపంచకప్‌ మ్యాచ్!

Uppal Stadium New

Uppal Stadium New

World Cup 2023 PAK vs NZ Warm-Up Match in Hyderabad to be played behind closed doors: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా హైదరాబాద్ నగరంలో భారత్ మ్యాచ్‌లు లేకపోవడంతో భాగ్యనగర క్రికెట్ ఫాన్స్ ఇప్పటికే నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. అసలే బాధలో ఉన్న హైదరాబాద్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రపంచకప్‌ తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సీఏకు ఇదివరకే తెలిపారు. పాక్-కివీస్ వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా హెచ్‌సీఏకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి హెచ్‌సీఏ తీసుకెళ్లింది. ప్రధాన మ్యాచ్ కాదు కాబట్టి.. తేదీ మార్చాల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. ఖాళీ స్టేడియంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు సూచించినట్లు హెచ్‌సీఏ వ్యవహారాలు చూస్తున్న జస్టిస్ లావు నాగేశ్వర రావు పీఏ దుర్గా ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!

‘ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఉడడంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దాంతో ఈ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకు చెబితే.. వారు అంగీకరించారు. సోమవారం బీసీసీఐకి లెటర్ రాశాం. బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని దుర్గాప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్‌, మిగతా ప్రధాన ప్రపంచకప్ మ్యాచ్‌లు ఫ్యాన్స్ మధ్యన జరుగుతాయని ఆయన చెప్పారు.