India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు యువ ఆల్‌రౌండర్ దూరం!

India Vs Ireland

India Vs Ireland

India vs Ireland: ఐర్లాండ్‌తో జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం గాయం కారణంగా ఐర్లాండ్ టూర్‌కు దూరం కానున్నాడు. అంతేకాదు.. నితీష్ ఇంగ్లాండ్ పర్యటనపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు కూడా దూరం కావచ్చునని తెలుస్తోంది.

బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నితీష్ రెడ్డి ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయంతో బాధపడుతున్నాడు. దీనివల్లనే అతను ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలోని వైట్ బాల్ సిరీస్‌లకు సైతం అందుబాటులో ఉండటం కష్టమేనని పీటీఐ (PTI) నివేదించింది. ఇటీవల ముగిసిన భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో నితీష్ భాగమయ్యాడు. ఆ సిరీస్‌లో మొదటి, మూడో మ్యాచ్ ఆడిన అతను, జట్టు కాంబినేషన్, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో రెండో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ మొత్తంలో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. నితీష్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ శెడ్గేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. భారత క్రికెట్‌లో హార్దిక్ పాండ్యాకు సరైన ‘లైక్-టు-లైక్’ రీప్లేస్‌మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ రెడ్డి మాత్రమే. అలాంటి ఆటగాడు గాయపడటం టీమిండియాకు పెద్ద మైనస్. ప్రస్తుతం భారత డొమెస్టిక్ సర్క్యూట్‌లో మంచి వేగంతో బౌలింగ్ చేస్తూ, మ్యాచ్‌ను ముగించగల సత్తా ఉన్న పేస్ ఆల్‌రౌండర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడం సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఐర్లాండ్ సిరీస్ కోసం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ స్థానానికి సరిపోయే బలమైన పేర్లు ఏవీ రేసులో కనిపించడం లేదు.

×
×
Ad

ఇక, భారత్, ఐర్లాండ్ మధ్య ఈ రెండు టీ20 మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్‌లో జరగనున్నాయి. మొదటి మ్యాచ్ జూన్ 26 శుక్రవారం, రెండో మ్యాచ్ జూన్ 28 ఆదివారం నిర్వహిస్తారు. ఈ యూకే పర్యటనలో భాగంగా ఆ తర్వాత భారత్, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి జూలై 11 వరకు ఈ టీ20లు జరుగుతాయి. అనంతరం జూలై 14 నుంచి 19 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ మూడు సిరీస్‌లకు నితీష్ రెడ్డి దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రకటించిన వన్డే జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణాను చేర్చిన సంగతి తెలిసిందే.