అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్‌లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది దీపావళికి ప్రత్యేకత ఉందన్నారు. చరిత్రలో తొలిసారిగా దీపావళి సందర్భంగా న్యూయార్క్‌లోని పాఠశాలలను మూసివేయనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం పాఠశాలలకు దీపావళి సెలవు ఉంటుంది.
మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు చదువుకునే న్యూయార్క్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని చౌహాన్ అన్నారు. దీనిపై కొన్నేళ్ల క్రితమే పలువురు హిందూ సంఘాల నేతలు ఉద్యమించారని గుర్తు చేశారు. ఇప్పుడు దీనిని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆమోదించారని తెలిపారు. హిందూ సమాజానికి ఇది చాలా ముఖ్యమైన నిర్ణయమని దిలీప్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు దీపావళి జరుపుకోవాలా లేక పాఠశాలకు వెళ్లాలా అనేది ఎంచుకోవాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. దీపావళి రోజున సెలవు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మేయర్ ఆడమ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు.
READ MORE:MP Raghunandan Rao: బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు