Brooklyn Shooting: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ మాట్లాడుతూ.. క్రౌన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన ముగ్గురు పురుషులేనని, వారిలో ఇద్దరు (27), (35) ఏళ్ల వయస్సు గలవారని, మూడో వ్యక్తి వయస్సు ఇంకా తెలియరాలేదన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
జాడలేని నిందితులు..
జెస్సికా టిష్ మాట్లాడుతూ.. కాల్పులకు కారకులైన వారిని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. సంఘటన స్థలం నుంచి సుమారుగా 36 కార్ట్రిడ్జ్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో కాల్పుల సంఘటనలు పెరుగుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో చాలా మంది డెమొక్రాట్లు తుపాకీ సంస్కృతిని నిషేధించే అంశాన్ని లేవనెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల అంశంగా కూడా మారింది. కానీ రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్‌ను నిలిపివేశారు.
READ MORE: Jharkhand Love Affair: లవ్ ఎఫైర్.. ఐదేళ్ల ప్రేమకు మృత్యు కానుక..