New Year Delivery Shock: టైమ్ చూసి గిగ్ వర్కర్లు షాకిచ్చారు. థర్టీ ఫస్టున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సర వేడుకల వేళ ఆన్లైన్లో ఫుడ్ లేదా గ్రాసరీస్ ఆర్డర్ చేసేవాళ్లకు బ్యాడ్ న్యూసే. డెలివరీ గిగ్ వర్కర్ల యూనియన్ల సమ్మెతో ముఖ్యంగా జెప్టో, బ్లింకిట్ వంటి 10 నిమిషాల డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. 10 నిమిషాల డెలివరీ మోడల్ సురక్షితం కాదని.. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు ఈ దేశవ్యాప్త సమ్మెకు దిగారు. దీంతో లక్షలాది డెలివరీలు నిలిచిపోయి కస్టమర్లతోపాటు.. రెస్టారెంట్లు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.
బ్లింకిట్, జెప్టో లాంటి సంస్థలు.. కస్టమర్లు ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. ఇలా కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధన గిగ్ వర్కర్ల ప్రాణాలకు ముప్పుగా మారిందనేది యూనియన్ల ఆరోపణ. ఇప్పటికే డిసెంబర్ 25న ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో జరిగిన సమ్మె వల్ల ఈ క్విక్ కామర్స్ సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు కొత్త సంవత్సర వేడుకల సమయంలో సమ్మె జరిగితే.. దేశవ్యాప్తంగా డెలివరీలు నిలిచిపోయే ఛాన్స్ వుంది. కేంద్ర ప్రభుత్వం ముందు గిగ్ వర్కర్లు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలను కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా నిషేధించాలి. మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, పారదర్శకమైన పెనాల్టీ వ్యవస్థ ఉండాలనేది వారి డిమాండ్లు.
ఫుడ్.. లాజిస్టిక్స్ వంటి డెలివరీ కార్మికులు.. వాటిల్లో పని చేసే వాళ్ళ ఆర్థిక.. ఉద్యోగ భద్రత కోసం గిగ్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ బిల్లు-2025 కు ఆమోదం తెలిపింది.ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే దేశంలోనే మొట్టమొదటిసారిగా సమగ్రమైన గిగ్ వర్కర్ల చట్టాన్ని తెచ్చిన రాష్ట్రంగా నిలుస్తుంది తెలంగాణ. రాష్ట్రంలో దాదాపు.. మూడు నుంచి నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్స్ వివిధ ప్లాట్ ఫామ్స్ లలో పని చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ సిటీలోనే అధికంగా గిగ్ వర్కర్స్ ఉండగా.. ట్రాన్స్పోర్ట్.. డెలివరీ.. లాజిస్టిక్స్.. ప్యాకేజింగ్ వంటి వాటిలోనే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా స్విగ్గీ.. జొమాటో.. అమెజాన్.. ఫ్లిప్ కార్ట్.. మింత్ర వంటి సేవలను ఎక్కువగా చూస్తుంటాం.. ఇవికాక అనేక సంఖ్యలో గిగ్ వర్కర్స్ వివిధ రకాల ప్లాట్ ఫామ్స్ లలో పని చేస్తున్నారు.
వీరంతా.. డైలీ.. పని గంటలు.. ఆర్డర్స్ వంటి ఆధారంగానే పని చేస్తూ సంపాదిస్తున్నారు. దాదాపు ప్రతి వర్కర్ పది నుంచి పన్నెండు గంటలు సగటున పని చేస్తున్నా.. వీరి సంపాదనలో ముప్పై శాతం కమిషన్ తీసుకుంటున్నాయి ప్లాట్‌ఫామ్‌లు.అయినా కనీస ఉద్యోగ.. జీవిత భద్రత కూడా లేదు. సో దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం నూతన బిల్లు తయారు చేయగా.. ఆమోదం పొందితే లక్షల మందికి ఉపయోగం కాబోతోంది. గిగ్ వర్కర్లను స్పెషల్ లేబర్ కమ్యూనిటీగా గుర్తించి.. వారికి ఆర్థిక.. సామాజిక భద్రతను కల్పించడమే కాకుండా.. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు బిల్లులో పొందుపరిచారు. స్విగ్గీ.. జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లు వర్కర్లకు చెల్లించే మొత్తంలో ఒక శాతం నుంచి రెండు శాతం వరకు వాటాను గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ కోసం ఇవ్వనున్నారు. దీనికి ప్రభుత్వం ఇతర నిధులను కూడా కలిపి గిగ్ సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని తెలిపింది.
ప్లాట్‌ఫామ్‌లు.. గిగ్ వర్కర్స్ కు తలెత్తే వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను కూడా తీరుకురానున్నారు. సగటున వంద మంది కార్మికులు పని చేస్తున్న ప్రతి ప్లాట్ఫామ్లో అంతర్గత వివాద పరిష్కార కమిటీని తప్పనిసరి చేయనున్నారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ చట్టం అమల్లోకి వస్తే.. సరైన కారణం లేకుండా ఎంప్లాయీస్ ను తొలగించడం కుదరదు. ఎంప్లాయిస్ ను తొలగించాలంటే ఏడు రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. వర్క్.. రేటింగ్‌లు.. బోనస్ వంటి అంశాల్లో ఎటువంటి ఇతర ప్రమేయం లేకుండా ప్లాట్ ఫామ్స్ యూజ్ చేసే అల్గారిథమ్‌లలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని తెలుపుతుంది గిగ్ బిల్లు. ఇటువంటి విధానాన్ని దేశ వ్యాప్తంగా తీసుకురావాలని కోరుతున్నారు గిగ్ కార్మికులు. గతంలో అనేకసార్లు.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని గిగ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. నిరసనలు వ్యక్తం చేశారు అయినా ఎటువంటి స్పందన లేకపోగా.. కంపెనీస్.. పనిచేస్తున్న కార్మికుల పై చర్యలు తీసుకుంటున్నాయి. ఇక తాజాగా.. ఈ నెల 25న దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్స్ తమ విధులకు బహిష్కరించి సమ్మె బాట పట్టారు.. దీంతో క్రిస్మస్ వేళ ఆర్డర్ డెలివరీస్ నిలిచిపోగా.. కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్ డెలివరీలు లేట్ అయ్యాయి.. దీంతో సంస్థలకు నష్టం వాటిల్లగా.. సమ్మెలో పాల్గొన్న కార్మికు లపై చర్యలు తీసుకుంటున్నాయి కంపెనీస్.
సమ్మెలో పాల్గొన్న కార్మికుల ఐడి బ్లాక్.. ఆల్గరిథం బేస్డ్ ఇష్యూస్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నాయి కంపెనీలు. ఇక సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులు.. వేధింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు కార్మికులు.హక్కుల కోసం గొంతు విప్పితే, కంపెనీలు ఐడీ బ్లాకింగ్, బెదిరింపులు, పోలీస్ వేధింపులు, ఆల్గోరిథమ్ శిక్షలుతో సమాధానం ఇస్తున్నాయని యూనియన్ల నేతలు అంటున్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి గిగ్ కార్మిక సంఘాలు. ఇది.. కంపెనీస్ కు నష్టం తెచ్చే అంశం.. ఏడాదంతా అయిన సేల్స్ ఒకెత్తయితే.. ఇయర్ ఎండ్ కు జరిగే సేల్స్ మరోఎత్తు. సో కార్మికుల కొరత ఏర్పడితే భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ వుంది.
న్యూ ఇయర్ వేడుకల కోసం లక్షలాది మంది ఆన్లైన్ ఆర్డర్లపై ఆధారపడతారు. సమ్మె ప్రభావం ఉంటే హోటల్ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న రెస్టారెంట్లు తమ సొంత సిబ్బందితో డెలివరీలు చేయాలని భావిస్తుండగా.. పెద్ద వాటికి మాత్రం ఇది పెను సవాలుగా మారింది. మరోవైపు.. కంపెనీలు తమను బ్లాక్ లిస్ట్ చేస్తాయనే భయంతో కొంతమంది ఏజెంట్లు సమ్మెలో పాల్గొనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. మొత్తానికి గిగ్ వర్కర్స్ డిమాండ్లపై ప్రభుత్వాలు.. కంపెనీస్ ఎలా స్పందిస్తాయో చూడాలి. న్యూ ఇయర్ కి ఆన్లైన్ ఆర్డర్ చేసుకుని తిందాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందా?చర్చలు జరిపి తమ సేవలను అందించాలని కార్మికులను ప్లాట్ ఫామ్స్ కోరుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.