కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రయాణికులకు చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అర్ధరాత్రి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు పోలీసు శాఖ తరఫున సీపీ హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆలోచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ… ‘కొత్త ఏడాదిలో అందరూ ట్రాఫిక్ నిబందనలపై అవగాహన పెంచుకోవాలి. పది రోజులుగా మా సిబ్బంది చేపట్టిన డ్రైవ్ కారణంగా ప్రజల్లో మార్పు వచ్చింది. మీ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని హెల్మెట్ విధిగా వాడండి. సీటు బెల్ట్, హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. పోలీసుశాఖ తరఫున ఈ కొత్త సంవత్సరంలో హెల్మెట్‌లు ప్రజలకు పంపిణీ చేశాం. ఇక నుంచి అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోకండి. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయంతో అందరూ ముందుగు సాగాలి’ అని అన్నారు.