తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న జరిగిన మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో.. వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సర్పంచ్ ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 22వ తేదీన కొత్త పాలకవర్గాలు పూర్తిస్థాయిలో కొలువుదీరనున్నాయి.
Also Read:Bigg Boss 9 Winner: బిగ్‌బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్! హిస్టరీ క్రియేట్ చేసిన విన్నర్..
దీంతో ప్రత్యేకాధికారుల పాలన ముగిసినట్లు అవుతుంది. 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కొత్త పాలక వర్గాలు రావడంతో ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేసి తమ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నూతన సర్పంచ్ లు వెల్లడించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.