NTV Telugu Site icon

New Registration Charges: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొత్త మెథడ్.. పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Anagani Satya Prasad

Anagani Satya Prasad

New Registration Charges: ఏపీలో భూమి రిజిస్ట్రేషన్‌ విలువ పెంపుపై గత కొంతకాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. జనవరి 1వ తేదీ నుంచి ధరలు పెరుగుతాయని సంకేతాలు వచ్చాయి.. అయితే, భూముల విలువ పెంపుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం… ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల చేయాలన్నది నియమంగా పెట్టుకుంది.. సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపుదల ఉండే అవకాశం ఉంది.. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపుకు కూడా కసరత్తు జరుగుతోంది.. రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు, రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారాల నేపథ్యంలో కొంతవరకూ కొన్ని చోట్ల భూముల ధరలు కూడా తగ్గనున్నాయి.. భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతాయని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ అండ్ స్టాంప్స్ శాఖపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.

Read Also: Terrorist Activities: భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు బంగ్లాదేశీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష

గత ప్రభుత్వం చేసిన విచ్చల విడి అప్పుల భారం నుండి రాష్ర్టం ఇప్పుడిప్పుడే కోలుకోంటోందని, అయితే రాష్ర్టానికి రెవెన్యూ కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ర్టేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు మంత్రి అనగాని. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ర్టేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ర్టేషన్ విలువల పెంపును శాస్ర్తీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ర్టేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి అన్ని చోట్ల రిజిస్ర్టేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుండి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ర్టంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటిన్నంటి పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో ఒక్క సెప్టెంబర్ మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి తాము టార్గెట్ గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు.

Read Also: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!

గత ప్రభుత్వంలో స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది… అలాగే భూముల రేట్లు పెరిగి ఆకాశాన్నంటుకున్న అర్బన్ ప్రాంతాలు విజయవాడ, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి లాంటి చోట కొంత వరకూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.. ఇంకొకపక్క కొన్ని చోట్ల భూముల ధరలు కూడా తగ్గనున్నాయని మంత్రి మాటల్లో తెలుస్తోంది..

Show comments