Netumbo Nandi Ndaithwa: ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది. ఇక తన సమీప ప్రత్యర్థి పాట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపిసి)కి చెందిన ఇటుల కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే రావడంతో భారీ మెజారిటీతో నంది-న్డైత్వా గెలుపొందారు.
Also Read: AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
1990లో దక్షిణాఫ్రికా నుండి నమీబియా స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుండి నంది-నాడైతవా రాజకీయాల్లో నిరంతరం క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పార్టీని మరింత పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. నివేదికల ప్రకారం 72 ఏళ్ల నంది-న్డైత్వా చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె 1960 లలో స్వాపో పార్టీలో చేరారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రితోపాటు పలు సీనియర్ పాత్రలు పోషించారు. దీనికి సంబంధించి, రాజకీయ విశ్లేషకుడు రాక్వెల్ ఆండ్రియాస్ ఆమెను స్వాపోలో ముఖ్యమైన నాయకురాలిగా అభివర్ణించారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆమె ఏదో ఒక రూపంలో ముందుంటుందని అన్నారు. ఇక ఆమె విజయం తర్వాత నంది-న్డైత్వా మాట్లాడుతూ “నమీబియా దేశం శాంతి, స్థిరత్వం కోసం ఓటు వేసింది.” అని ఆవిడా అన్నారు.