Israel Gaza War: ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్ శక్తిసామర్థ్యాలపైన కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన ఉంది. తాజాగా ఇజ్రాయెల్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలై దాదాపు 22 నెలలవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు గాజాలో దాదాపు 61 వేలమందికి పైగా మృతి చెందారు. మరోవైపు హమాస్ చెరలో ఇంకా దాదాపు 50 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు.
READ MORE: Marijuana: గంజాయి.. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి..
సెక్యూరిటీ క్యాబినెట్ ముందుకు కొత్త ప్లాన్..
గాజాలో దాడులను మరింత విస్తరించేందుకు, హమాస్‌ను పూర్తిగా అంతమొందించడంతో పాటు బందీలను విడిపించేందుకు నెతన్యాహు అప్‌డేట్ చేసిన యుద్ధ ప్రణాళికను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గాజా స్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనను సెక్యూరిటీ క్యాబినెట్ ముందు ఉంచుతానని తన మంత్రులతో ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు సంబంధిత వర్గాలు ఉటంకించాయి. గాజాలో దాదాపు 75 శాతం భూభాగం ప్రస్తుతం ఐడీఎఫ్ నియంత్రణలో ఉంది. నూతన ప్రణాళిక ప్రకారం మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. దీన్ని ఐడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. ఒకవేళ దీనికి ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంగీకరించకపోతే.. ఆయన రాజీనామా చేయాలని నెతన్యాహు స్పష్టం చేసినట్లు తెలిపాయి.
READ MORE: Udayabhanu : ఆర్టిస్టుల ఆకలి తీర్చే పాత్రలో నటించా!
ఐడీఎఫ్ అభ్యంతరాలు..
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నుంచి గాజా స్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కానీ ప్రధాని నెతన్యాహు మాత్రం ముందుకే వెళ్లాలని నిర్ణయించినట్లు, గాజాలో బందీలను దాచి ఉంచిన ప్రాంతాల్లోనూ సైనిక ఆపరేషన్లు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఐడీఎఫ్ పేర్కొంటోంది. అదే విధంగా.. హమాస్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు అనేక సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఈ ప్లాన్‌ను పాలస్తీనా అథారిటీ అధికారులూ ఖండించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొని కొత్త సైనిక ఆక్రమణలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.