Nepal Floods: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఘటనతో అనేక దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో గల్లంతు అయ్యారు. ఇందులో తాజాగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఇక్కడి నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు ఎన్‌ఆర్‌ఐలు నేపాల్‌లోని రసూవగధీ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో కెనడా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ సోమయాజుల సాయిప్రసాద్‌తో పాటు అమెరికా, లండన్ నుంచి వచ్చిన మరికొందరు తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్ తర్వాత రెస్క్యూ, సెర్చ్, రిలీఫ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. నేపాల్ సైన్యం, భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. కొండ ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో నదులు, డ్యామ్‌డ్ లేక్‌ల నీటిమట్టాలను నేపాల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
భారీ విపత్తు నేపథ్యంలో విదేశీ సహాయంపై నేపాల్ తన వైఖరిని మార్చుకుంది. భారత్, చైనా నిపుణుల బృందాలకు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు చెందిన నిపుణుల బృందాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా టన్నెల్ రెస్క్యూ, డీఎన్‌ఏ పరీక్షలు వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన కార్యకలాపాల్లో విదేశీ నిపుణుల సహాయం తీసుకోనుంది. అయితే సాధారణ రెస్క్యూ, సహాయక చర్యలను మాత్రం నేపాల్‌కు చెందిన బృందాలే కొనసాగించనున్నాయి.
భారీ వరదలు, ఫ్లాష్‌ఫ్లడ్ కారణంగా నేపాల్‌లో ఇప్పటివరకు 550 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 1,924 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన విదేశీయుల్లో 288 మంది భారతీయులు ఉన్నారు. అప్పర్ త్రిశూలీ-1 ప్రాంతంలో పనిచేస్తున్న 576 మంది కార్మికుల ఆచూకీ కూడా తెలియడం లేదు. వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ నుంచి టన్నెల్ రెస్క్యూ, వైద్య బృందాలను కూడా నేపాల్‌కు పంపించారు.

