NTV Telugu Site icon

Nellore YCP: నెల్లూరు నగర వైసీపీలో మరోసారి విభేదాలు

Nellore Ycp

Nellore Ycp

Nellore YCP: నెల్లూరు నగర వైసీపీలో నాయకులను ఏకతాటిపై నడిపించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నా పరిస్థితి మారలేదు. వారం క్రితం కావలి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్ యాదవ్‌లను కలిపి ఒకరి చేతిలో ఒకరి చేయి వేసి భవిష్యత్‌లో కలిసి కట్టుగా పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో అంతా సర్దుకుంటుందని భావించే లోగా..రాజకీయాలైనా వదులుకుంటా కానీ రూప్ కుమార్ యాదవ్‌తో కలిసి పనిచేసే పరిస్థితి లేదని అనిల్ తరపున ప్రకటన విడుదల చేయడం సంచలనం కలిగించింది. ఇదే తరుణంలో రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతు దారుడైన వైసీపీ నేత హాజీపై దాడి చేయడం కలకలం రేపింది. అనిల్ వర్గీయులే హాజీపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. హాజీపై దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాజీని రూప్ కుమార్ యాదవ్ పరామర్శించారు.

.తనకు మద్దతు ఇస్తున్న నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే అనిల్ కుమార్ ఈ విధంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఒక కార్పొరేటర్ నాగరాజు ఇంటిని ధ్వంసం చేశారని.. అప్పుడు పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని రూప్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
అనంతరం మరో నేత మున్వర్‌కు చెందిన దుకాణం వద్ద మెట్లను పగలగొట్టించారని.. అంతేకాకుండా తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించారని రూప్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను భరిస్తున్నానని.. భవిష్యత్తులో మరో మారు తమ వర్గీయులపై దాడి జరిగితే ఊహించనంతగా స్పందిస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా నెల్లూరు నగరంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని అనిల్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు.

Read Also: AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్‌ చేసుకోండి..

ఇప్పుడైనా.. ఇక్కడి పరిణామాలపై నివేదిక తెప్పించుకొని తప్పు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గీయుల మధ్య ప్రతి విషయంలోనూ సమస్యలు వస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నెల్లూరు నగర వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో రూప్ వర్గీయులు చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన వరకే అబద్ధాలు కొనసాగుతుండటంపై పార్టీ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.