Site icon NTV Telugu

NEET Exam: మణిపూర్‌లో నీట్ పరీక్ష వాయిదా.. ఎన్‌టీఏ నిర్ణయం

Neet Exam

Neet Exam

NEET Exam: ఆదివారం దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్‌ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్‌ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. హింసాత్మక మణిపూర్‌లోని కేంద్రాలలో ఆదివారం జరగాల్సిన నీట్ (యుజి) పరీక్షలను తరువాత తేదీ వరకు వాయిదా వేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం నిర్ణయించింది. మణిపూర్‌లోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీట్ (UG) 2023 పరీక్షలను రీషెడ్యూల్ చేయడం గురించి కేంద్ర విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ లేఖ రాసిన తర్వాత ఇది జరిగింది.

Read Also: Student Suicide: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థిని ఫెయిల్.. మనస్తాపంతో ఆత్మహత్య

మణిపూర్‌లో ఓ వర్గానికి ఎస్టీ హోదా కల్పించడాన్ని నిరసిస్తూ అక్కడి గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు, నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌ పరీక్షా కేంద్రాల్లో నీట్‌ పరీక్షను రద్దు చేశారు. సమాచారాన్ని అభ్యర్థులకు ఆటో కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా చేరవేసినట్లు తెలిపారు. ఈ పరిణామంపై రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలను వాయిదా వేయాలని ఎన్టీఏను తాను అభ్యర్థించినట్లు తెలిపారు. “ప్రస్తుత పరిస్థితిలో పరీక్షను వాయిదా వేయమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులను అభ్యర్థించాను. పరీక్ష కొత్త తేదీ నిర్ణయించబడుతుంది. మణిపూర్‌లోని రెండు కేంద్రాలలో మొత్తం 8751 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది,” అని ఆయన చెప్పారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించేందుకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.మెజారిటీ మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చడానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అంతర్-సంఘాల ఘర్షణల తక్షణమే చెలరేగిన హింసాకాండపై ఈ సమావేశంలో చర్చించారు.

Exit mobile version