Mansukh Mandaviya: 12 ఏళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన మంత్రి..

Mansukh Mandaviya

Mansukh Mandaviya

Mansukh Mandaviya: గడిచిన 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం క్రీడా రంగం రూపురేఖలను మార్చడమే కాకుండా, ఉపాధి కల్పనలోనూ అసాధారణ ప్రగతి సాధించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ఎన్డీయే వారపు ‘మంగళ మిలన్’ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత రంగాల్లో ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. 2014 తర్వాత దేశంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి పథకాలతో పాటు క్రీడా పాలనలో పారదర్శక సంస్కరణలు తీసుకువచ్చామని, ఖేలో భారత్ నీతి, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ ద్వారా అథ్లెట్లకు మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. 2036 నాటికి ప్రపంచంలోని టాప్-10 క్రీడా దేశాల్లో ఒకటిగా, 2047 నాటికి టాప్-5లో ఒకటిగా నిలవడమే లక్ష్యంగా ఖేలో ఇండియా పథకం (2026-31) బడ్జెట్‌ను పెంచామని పేర్కొన్నారు. భారత్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి సిద్ధమవుతున్న వేళ.. ఆసియా క్రీడల్లో తొలిసారిగా 107 పతకాలు, పారా ఆసియా క్రీడల్లో 111 పతకాలు సాధించి చారిత్రక రికార్డు సృష్టించామని, ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ దేశానికి తొలి స్వర్ణం దక్కిందని గుర్తుచేశారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో కొన్ని కీలక క్రీడలు లేకపోయినప్పటికీ, పోటీ పడిన 8 క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ఇందులో ఒక్క బాక్సింగ్‌లోనే 7 స్వర్ణాలతో సహా 10 పతకాలు, జూడోలో కామన్వెల్త్ చరిత్రలోనే తొలి స్వర్ణం సాధించడం విశేషమని అన్నారు.

మరోవైపు ఉపాధి, సామాజిక భద్రతపై ఇచ్చిన ప్రత్యేక ప్రజెంటేషన్‌లో మన్సుఖ్ మాండవీయ కీలక గణాంకాలను వెల్లడించారు. 2014 నుంచి 2024 మధ్య NDA పాలనలో ఏకంగా 17.1 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టింపబడ్డాయని, గత UPA ప్రభుత్వ హయాంలో నమోదైన 2.9 కోట్ల ఉద్యోగాలతో పోలిస్తే ఇది దాదాపు 6 రెట్లు ఎక్కువ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు, మేక్ ఇన్ ఇండియా, PLI పథకం మరియు రూ.2 లక్షల కోట్ల ప్రధాని ప్యాకేజీల ఫలితంగా 2025 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.1%కి పడిపోయిందని, ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే, ప్రపంచ సగటు (4.8%) కంటే మెరుగైనదని వెల్లడించారు. యువతలో ఉద్యోగానికి తగిన నైపుణ్యం (Employability) 2013లోని 34% నుంచి 2025 నాటికి 56%కి పెరిగిందని, అలాగే 2026 నాటికి ఏకంగా 101 కోట్ల మంది పౌరులు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని పేర్కొంటూ, గత 12 ఏళ్ల పాలన ఉద్యోగ-నైపుణ్య-సామాజిక భద్రతలకు స్వర్ణయుగమని ముగించారు.