Veerasimhareddy: నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ను ఖరారు చేయగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే ‘సింహా’ అన్న పదం నందమూరి బాలకృష్ణకు భలేగా కలసి వస్తుందని వేరే చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా రూపొందిన “సమరసింహారెడ్డి, నరసింహనాయుడు” చిత్రాలు ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి. వసూళ్ళలో ఆ చిత్రాలు సరికొత్త రికార్డులు సృష్టించడమే కాదు, రన్నింగ్ లోనూ పలు చెరిగిపోని మైలురాళ్ళను నెలకొల్పాయి. ‘సమరసింహారెడ్డి’ చిత్రం 30కి పైగా కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకొని, స్టార్ హీరోస్ సినిమాలకూ ఓ ఊపును తీసుకు వచ్చింది. ఇక తెలుగు చిత్రసీమలో తొలిసారి వందకు పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రంగా ‘నరసింహనాయుడు’ నిలచింది. ఈ రెండు చిత్రాలు నేరుగా ద్విశతదినోత్సవాలు చూడడం ఓ విశేషం! ఆ తరువాత బాలయ్య నటించిన “సీమసింహం, జై సింహా” వంటి చిత్రాలు సైతం శతదినోత్సవాలు చూశాయి. ఇక బాలయ్యతో బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘సింహా’ కూడా ఘనవిజయం సాధించి, తొంభైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. డైరెక్టుగా ద్విశతదినోత్సవాలు జరుపుకుంది. ఈ తీరున టైటిల్ లో ‘సింహ’ అన్న పదం చోటు చేసుకొని డైరెక్టు గా డబుల్ సెంచరీ చూసిన మూడు సినిమాలు కలిగిన ఏకైక హీరోగా బాలకృష్ణ నిలచిపోయారు. ఇలా ‘సింహా’ శబ్దం బాలకృష్ణకు అచ్చి రావడంతో ఆయన జనం మదిలో ‘నటసింహ’గా నిలిచారు. ఇప్పుడు మరోమారు బాలయ్య సినిమా టైటిల్ లో ‘సింహ’ అన్న పదం చోటు చేసుకోవడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు.
బాలకృష్ణ సినిమా టైటిల్ లో ‘సింహ’ అనే పదం చోటు చేసుకున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రన్నింగ్ ఎలా ఉన్నా, కలెక్షన్స్ మాత్రం భలేగా లభించాయి. అదే తీరున ఈ ‘వీరసింహారెడ్డి’ సినిమా కూడా విజయవిహారం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, దర్శకుడు గోపీచంద్ మలినేని, నాయిక శ్రుతిహాసన్ బాలయ్యతో తొలిసారి కలసి పనిచేస్తున్నారు. బాలయ్య కెరీర్ ను పరిశీలిస్తే ఆయనకు ‘ఫస్ట్’ కాంబినేషన్స్ లో ‘బెస్ట్’ రిజల్ట్స్ లభించాయి. అదే తీరున ఈ సినిమాతోనూ బాలకృష్ణ మరో ఘనవిజయాన్ని మూటకట్టుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ ‘వీరసింహం’ బాక్సాఫీస్ వద్ద ఏ తీరున చెలరేగుతుందో చూడాలి.
‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ లాగే ఈ ‘వీరసింహారెడ్డి’నీ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరి ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.