తప్పతాగి రోడ్డెక్కడం.. రయ్య్‌మని దూసుకెళ్తూ అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓవర్ స్పీడ్.. ర్యాష్ డ్రైవింగ్‌లకు పోలీసులు అడుగడుగునా చెక్‌పెడుతున్నా మందుబాబులు మాత్రం రెచ్చిపోతున్నారు. పట్టపగలే పీకలదాకా తాగి ర్యాష్ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్‌లకు పాల్పడుతున్నారు. నార్సింగ్‌లో తాజాగా జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. పట్టపగలే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రమాదంలో ఓ మహిళ కొనప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. నార్సింగ్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఇది. యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్ చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిస్తోంది.
రోడ్డుపై ప్రశాంతంగా ఎవరి దారిలో వాళ్లు వెళ్తున్న వాహనదారులను… వెనక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది బీఎమ్‌డబ్ల్యూ కార్. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వేగంగా ఢీ కొట్టడంతో. బైక్ పై ఉన్న వాహనదారులు ఎగిరి పడ్డారు. బైక్ పై మహిళ తీవ్రంగా గాయపడింది. మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. బీఎండబ్లూ కారుతో ప్రమాదం చేసిన యువకుడిని అభిషేక్‌గా గుర్తించారు పోలీసులు. అభిషేక్‌కి పోలీసులు టెస్ట్ చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Crime News: వీడు అసలు మనిషేనా.. కట్టుకున్న భార్యను ఇటుకలతో కొట్టి చంపిన కసాయి భర్త!
కారు ఓనర్ నితిన్‌గా గుర్తించి.. నితిన్‌తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు యువకులపై కూడా కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ప్రమాదంలో గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. మరోవైపు రోడ్డుపై తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాదీలు కోరుతున్నారు. అమాయకుల ప్రాణాలు పోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట లేదా.. ప్రత్యేక రోజులలో మాత్రమే చేసే డ్రంక్ అండ్ డ్రైవ్‌లు మరింత పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.