NTV Telugu Site icon

MPDO Missing Mystery: వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. ఇంతకీ ఏం జరిగినట్టు..?

Mpdo

Mpdo

MPDO Missing Mystery: నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్‌ కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోయారా? అనే విషయంలో అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్.. 4 బోట్లలో ఏలూరు కాల్వను జల్లెడ పట్టనుంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌.. గన్నవరం సమీపంలో ఉన్న కీసరపల్లి నుంచి ఇవాళ గాలింపు చర్యలు మొదలు పెట్టనున్నారు.. మొత్తం 30 మంది సిబ్బందితో ఏలూరు కాల్వలో పూర్తిస్థాయిలో గాలింపు చర్యలకు దిగారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఈ కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో.. విచారణ వేగవంతం చేశారు పోలీసులు.

Read Also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు

మరోవైపు.. MPDO రమణా రావు మిస్సింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు. ఫెర్రీ వేలం బకాయి 54లక్షల వసూలు విషయంలో ఒత్తిడికి లోనైనట్టు లేఖలో పేర్కొన్న వెంకట రమణారావు.. ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకెక్కడైనా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశించారు. నీతో రంగంలో దిగిన అధికారులు.. 2023- 24 ఫెర్రీ వేలం , చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నారు. బకాయి దారుడు నుంచి  54 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు జేఏసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఏలూరు కాల్వలో ఇప్పటి వరకు ఎంపీడీవో ఆచూకీ లభించలేదు.. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏలూరు కాల్వలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేట్టాయి.. అయినా ఫలితం దక్కలేదు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?

కాగా, నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం విదితమే.. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీసిన ఆయన.. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని.. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని.. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్నవారి వివరాలను తక్షణమే అందించాలని.. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే.