Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?

  • నేచురల్ స్టార్ నాని, తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌
  • సినిమా రానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం..
  • నాని సరసన హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక..?
Nani Rukmini Vasanth

Nani Rukmini Vasanth

Nani – Rukmini Vasanth: విభిన్నమైన కథాంశాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, త్వరలోనే హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో బాగా టాక్ వినపడుతుంది. ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాలతో భావోద్వేగాలను వెండితెరపై దృశ్యకావ్యాలుగా మలిచిన తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసిన ఈ కథ భావోద్వేగాల మేళవింపుతో కూడిన పూర్తి స్థాయి లవ్ స్టోరీగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో కథానాయిక పాత్ర చాలా బలంగా, కథను మలుపు తిప్పే విధంగా డిజైన్ చేశారట. నటనకు ఎంతో ఆస్కారమున్న ఈ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత.. పలు చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రుక్మిణి వసంత్‌ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నాని సరసన ఆమె జోడీ కడితే, వెండితెరపై సరికొత్త అనుభూతిని పంచే క్లాసిక్ పెయిర్ కానుంది.

గతంలో ‘96’ చిత్రంతో వ్యక్తీకరించలేని ప్రేమను, మధురమైన జ్ఞాపకాలను అత్యద్భుతంగా ఆవిష్కరించిన ప్రేమ్ కుమార్.. ‘సత్యం సుందరం’తో మనుషుల మధ్య నిస్వార్థమైన బంధాలను అంతే గొప్పగా చూపించారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు నాని వంటి సహజ నటుడితో చేతులు కలపడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ ఎపిసోడ్ల కంటే.. పాత్రల స్వభావాలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలకే ఈ చిత్రంలో పెద్దపీట వేయనున్నట్లు టాక్. ప్రస్తుతం దర్శకుడు సుజిత్ ప్రాజెక్ట్‌ “బ్లడీ రోమియో”తో బిజీగా ఉన్న నాని.. ఆ తర్వాత ఈ ఎమోషనల్ ప్రేమకథను పట్టాలెక్కించే అవకాశముంది. ఈ క్రేజీ కాంబినేషన్, హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు.