Nandini Reddy: సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వగానే.. కొందరు దర్శకులు, హీరోలు తమ రెమ్యునరేషన్‌ను ఆకాశానికి పెంచేయడం ఈ మధ్య కాలంలో గమనించవచ్చు. అయితే ఈ ధోరణిపై టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా NTV పాడ్‌క్యాస్ట్ లో పాల్గొన్న నందిని రెడ్డి సినిమా బడ్జెట్, నిర్మాతల భద్రతపై తన మనసులోని మాటను పంచుకున్నారు.
నిర్మాత ఇండస్ట్రీకి చెట్టు లాంటివాడు:
ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితిపై స్పందిస్తూ.. ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటేనే ఇండస్ట్రీ బతుకుతుంది. మనకు అన్నం పెట్టే చెయ్యి అది.. దాన్ని ఎలా నరుకుతాం? సినిమా హిట్ అయింది కదా అని నా రెమ్యునరేషన్‌ను విపరీతంగా పెంచేసి సినిమాపై అదనపు భారం వేయడం నాకు ఇష్టం ఉండదు. నా వల్ల ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ కూడా ఒక్క రూపాయి పోగొట్టుకోలేదు. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే.. సినిమా బిజినెస్ అయ్యాక లాభాలు వస్తే అందులో నాకు ఇవ్వండి అని చెప్తాను తప్ప, ముందే ప్రొడ్యూసర్‌ను బర్డెన్ చేయను” అని ఆమె అన్నారు.
ఓటీటీ శాపం కాదు.. థియేటర్లకు పూర్వవైభవం:
గత కొన్నేళ్లుగా ఓటీటీల హవా వల్ల థియేటర్లకు ఫుట్‌ఫాల్స్ తగ్గాయని అంగీకరిస్తూనే.. భవిష్యత్తుపై ఆమె ఆశావాదం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ తమ కండిషన్స్ తగ్గించుకుంటున్నాయి. ఒక రకంగా ఇది మనకు శాపంలా అనిపించినా.. లాంగ్ రన్‌లో వరం కానుంది. మేకర్స్ అందరూ మళ్లీ థియేటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం మొదలుపెడతారు. ముఖ్యంగా మిడ్-బడ్జెట్ సినిమాలు మళ్లీ థియేటర్లను బతికిస్తాయి” అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సమంతతో ఆమె తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం పట్ల నందిని రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

