NTV Telugu Site icon

Nandi Drama Festivals: నంది నాటకోత్సవాలు ప్రారంభం.. అనర్హులకు నంది అవార్డులు రావు: పోసాని

Nandi Drama Festivals

Nandi Drama Festivals

Nandi Drama Festivals: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది నాటక రంగ కళాకారులు హాజరయ్యారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే నాటక రంగం మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందని, నాటకాలు ఆడుకునేందుకు ఓపెన్ ఆడిటోరియాలు నిర్మించాలని కళా పరిషత్ నిర్వాహకులు కోరుతున్నారు. మరో వైపు అత్యంత పారదర్శకంగా ఈ పోటీలు నిర్వహించేందుకు, అవార్డులు ప్రకటించేందుకు విస్తృత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నాటక పోటీలకు వచ్చే కళాకారులకు విస్తృత సౌకర్యాలు కల్పించింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకొత్సవ ప్రారంభ వేడుకలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తదితరులు హాజరయ్యారు.

Read Also: Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు

అత్యంత పారదర్శకతతో నంది నాటక పోటీలు: పోసాని కృష్ణమురళి
ఈ ప్రభుత్వాన్ని కళాకారులు నమ్మాలని, ఒకరికి కూడా అనర్హులకు నంది అవార్డులు రావు అని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. అత్యంత పారదర్శకతతో నంది నాటక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కళాకారుల సాధక బాధకాలు తెలిసిన 27 మంది జడ్జిలను పెట్టామని ఆయన వెల్లడించారు. వాళ్ల తీర్పులో ఎలాంటి పొరపాటుకు తావు ఉండదన్నారు. రాజకీయాలు ఉండవు, రికమండేషన్‌లు ఉండవన్నారు. అవార్డులు తీసుకున్న వారు అనర్హులు అని తేలితే తెలుగు రాష్ట్రాలనుండి వెళ్లిపోతానని పోసాని అన్నారు.

Also Read: Congress Manifesto: 2024 ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం

గాంధీజీని చూసి ప్రేరణ పొందిన నాయకుడు జగన్‌
నాటక రంగం ఒక అద్భుతమని, మహాత్మా గాంధీకి ప్రేరణ కలిగించింది కూడా నాటక రంగమేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. సత్యహరిచంద్ర నాటకం చూసే సత్యమేవ జయతే అనే నినాదాన్ని గాంధీ అనుసరించారన్నారు. అదే గాంధీజీని , అదే సత్య హరిచంద్ర నాటకాన్ని చూసి ప్రేరణ పొందిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మంత్రి తెలిపారు. పేదరికం అనే తరతరాల రోగాన్ని తగ్గించే ఔషదాన్ని కనిపెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. నాటక రంగాన్ని సజీవంగా ఉంచాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. నంది అవార్డులు ఇవ్వడం ద్వారా కళాకారుల పట్ల, కళాకారుల జీవన ప్రమాణాలు పట్ల ప్రభుత్వానికి ఉన్న భావం తెలుస్తుందన్నారు.

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. “2014కు ముందు చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పారు.. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేయలేము అని జగన్ భావించారు. అసత్యంతో అధికారం అవసరం లేదు అని చెప్పిన గొప్ప నేత జగన్. జగన్ నిజం లాగా ఉంటారు. నిజానికి ఓటు వేయండి. అబద్ధం అనే ఆరు తలలు కలిగిన నేత చంద్రబాబు.. నిత్యం నిజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నంది నాటకాలు ఉన్న గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం విశేషం. చరిత్ర ఒక ప్రేరణ కావాలి , చరిత్రకారుడు ఒక మార్గదర్శక కావాలి…బలహీన వర్గాలు మిగిలిన సమాజాలు బలహీనులుగా కనిపిస్తున్నారు. కానీ బీసీలను సమాజానికి వెన్నెముకగా భావించిన నాయకుడు జగన్. మన జీవితంలో బీసీ వర్గాలు లేకుండా ఏ పని జరగదు. సమాజాన్ని ప్రేరేపించే నాటకాలు ఈ నంది అవార్డుల ప్రదర్శనలో ఉంచారు.” అని మంత్రి తెలిపారు.