AP Elections 2024: ఏపీలో అన్ని పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి.. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు నేతల సవాళ్లు, విమర్శలు, ఆరోపణలు మరింత హీట్ పెంచుతున్నాయి.. ఇక, నేతల తరపున తమ కుటుంబ సభ్యులు.. పార్టీ కోసం కీలక నేతలు, రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న కుటుంబాలకు చెందినవాళ్లు ఇలా అంతా రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా నేటి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు నందమూరి రామకృష్ణ.. ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.. ఈ రోజు నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించి, అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్న నందమూరి రామకృష్ణ. అనంతరం గుడివాడ, పెడన, పామర్రు నియోజకవర్గాలలో ప్రచారంలో పాల్గొననున్నారు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు.. ఎన్నికల వరకు ప్రచారంలో పాల్గొనే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారట నందమూరి రామకృష్ణ.
Read Also: Siddharth Roy OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ రాయ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరోవైపు.. నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.. మరోసారి హిందూపురం బరిలోకి దిగిన ఆయన.. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు.. బహిరంగ సభల్లో పాల్గొంటూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక, రేపే బాలయ్య ఉత్తరాంధ్ర టూర్ ప్రారంభం కాబోతోంది. మే 2వ తేదీన గురువారం రోజు సాయంత్రం 4:30 గంటలకు చీపురుపల్లి, సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు బాలయ్య.. ఇక, మే 3వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 4:30 గంటలకు భీమిలి, సాయంత్రం 6 గంటలకు శృంగవరపు కోటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 6:45 గంటలకు వైజాగ్ రోడ్డుషోలో పాల్గొననున్నారు నందమూరి బాలకృష్ణ.