Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి తలవంచని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. నటరత్న, నటధీరుడు ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో వెలుగుచేసిన ఒక కాంతి అని, ఆయన నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలించాయని అన్నారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళ పాత్రల్లో ఆయన వేసిన అభినయం, శరీరభాష ప్రజలను ఆ పాత్రలతో మమేకం చేసిందని.. నిజంగా, ప్రతి తెలుగు వాడిని “నేను తెలుగు వాడిని” అని గర్వంగా చెప్పుకొనేలా చేసినవారు ఎన్టీఆర్ అని అన్నారు.
Also Read: SSIA: సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
నటనలో విజయంతో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి, పేద ప్రజలకు అండగా నిలిచారని, ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అమలైన అనేక పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఆయనను చిరస్మరణీయుడిగా నిలిపాయని గుర్తు చేసారు. రెండు రూపాయల బియ్యం పథకం ఎన్టీఆర్ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని, మండల వ్యవస్థ ఏర్పాటు, పాలనను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసిందని తెలిపారు. చెన్నై నగరానికి నీటి సరఫరా చేసి భగీరథుడిగా ప్రశంసలు పొందారని, పేదవారికి సొంత ఇళ్ల కలను సాకారం చేశారని కొనియాడారు.
Also Read: Formula E race inquiry: ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు
ఎన్టీఆర్ నిజమైన ప్రజానాయకుడని, పేద ప్రజల ఆకలి బాధలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచిన అన్న అంటూ పేర్కొన్నారు. మహిళలకు అన్నగా, యువతకు ఆదర్శంగా ఎన్టీఆర్ తానే ప్రత్యేకమన్నారు. ఆయన రాజకీయ విధానాలు, ప్రజలకు అందించిన సేవలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పొగిడారు. ఎన్టీఆర్ శివైకం అయ్యి 29 ఏళ్లు గడిచినా, ఆయన ప్రతిభ ప్రజల గుండెల్లో నిత్యజీవిగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు మన మదిలో, ఆయన చిరునవ్వు మన గుండెల్లో, ఆయన చేసిన సేవలు మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని, ఒక నటుడిగా.. నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు ప్రతి తెలుగువాడికి గర్వకారణమని, ఎన్టీఆర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. తెలుగువారి గర్వకారణమైన చరిత్ర అని బాలకృష్ణ తెలిపారు.