Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. వసంత త్వరలో టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.. నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్.
Read Also: Minister Seethakka : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
ఇక, 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ స్థలాలకు అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగ్ చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి డబ్బు రాలేదు అన్నారు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్.. కాంట్రాక్టర్లంతా రోజూ నా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినాయన.. ఇప్పుడు నిధులు తెచ్చినా చేసే వాళ్లే లేరని వాపోయారు. సంక్షేమంలో అందరినీ సంతృప్తి పరచగలిగాం.. కానీ, అభివృద్ధిలో చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేసిన వైసీపీ కార్యకర్తకి 7 కోట్ల విలువైన డ్రైన్లు, రోడ్లు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తే.. అప్పులపాలై వాళ్ల తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకున్నాడు అని చెప్పుకొచ్చారు. నిధులు లేకుండా నేను ఎన్ని రోజులు పని చేసేది? మానసికంగా ఇదంతా కష్టంగా ఉంది అని నిలదీశారు. ఎప్పుడు తెల్దారుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా అని రోజూ ఎదురు చూడడమే శాసనసభ్యుల పనిగా మారిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.