గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలయ్యాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన అనంతరం రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే ఇటీవలి రోజుల్లో కేశినేని నాని రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో కేశినేని నాని స్పందించారు. తన నిర్ణయం మారదని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను నమ్ముతున్నా అని స్పష్టం చేశారు.
Also Read: Tirupati: నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు!
‘నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నా. రాజకీయాలకు అతీతంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. సమాజానికి నా సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి ఉండదు. కేవలం నా అంకిత భావంతోనే ముడిపడి ఉంది. నా రాజకీయ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని కోరుతున్నా’ అని కేశినేని నాని పేర్కొన్నారు.