Muttiah Muralitharan About Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఏకంగా 800 వికెట్స్ పడగొట్టాడు. 1992-2010 మధ్య 133 టెస్ట్ మ్యాచ్‌లలో ముత్తయ్య ఈ రికార్డు నెలకొల్పాడు. దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145 మ్యాచ్‌లలో 708 వికెట్స్ తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్స్ తీశాడు. ముత్తయ్యకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. దాంతో తన రికార్డును ఏ బౌలర్ బ్రేక్ చేయలేడని మాజీ ఆఫ్ స్పిన్నర్ అంటున్నాడు. ప్రస్తుత క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌పైనే దృష్టి సారిస్తున్నారని, అందుకే తన రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావడం లేదన్నాడు.
అదే సమయంలో టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ముత్తయ్య మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంగ్లీష్ వార్తాపత్రిక డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ… ‘ప్రతి దేశం ఏడాదిలో ఆరు లేదా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్‌కు ప్రేక్షకాదరణ ఉండొచ్చు. కానీ కొన్ని దేశాల్లో చాలామంది టెస్ట్ క్రికెట్ చూడట్లేదు. దాంతో టెస్టు మ్యాచ్‌ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది’ అని అన్నాడు.
Also Read: Hyundai Alcazar 2024: ‘హ్యుందాయ్ అల్కాజార్’ నయా వెర్షన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
‘టెస్ట్ ఫార్మాట్‌లో నా 800 వికెట్ల రికార్డును మరో బౌలర్ అధిగమించడం కష్టం. ఎందుకంటే ప్రస్తుత క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌లో ఆడేందుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. మా కాలంలో ఆటగాళ్లకు 20 ఏళ్ల కెరీర్ ఉండేది. ఇప్పుడు క్రికెటర్ల కెరీర్ పూర్తిగా తగ్గిపోయింది’ అని ముత్తయ్య మురళీధరన్ చెప్పాడు. ప్రస్తుత ఆటగాళ్లలో నాథన్ లైయన్ (530), ఆర్ అశ్విన్ (516) మాత్రమే 500 వికెట్ల క్లబ్ లో ఉన్నారు. ఈ ఇద్దరు మరో 2-3 ఏళ్లు ఆడే అవకాశముంది. 800 వికెట్ల మార్క్‌ను వీరు అందుకోవడం అసాధ్యమే.