ఒక్కోసారి ఓడినా మంచే జరిగిందంటారు పెద్దలు. మన బలం, బలహీనతలు బయటపడతాయంటారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు అదే అంటున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా.. అంతిమంగా బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. మునుగోడు గెలుపు.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందనే నినాదాన్ని ఆ పార్టీ తెరమీదకు తెచ్చింది. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు పార్టీలో చేరడంతో తమ విజయం ఖాయమని కమలం పార్టీ భావించినా.. కామ్రేడ్స్ కారుతో కలిసి నడవడం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే బీజేపీ బలం భారీగా పెరిగింది. ఓటమిని నెగిటివ్ కోణంలో చూడకుండా.. పాజిటివ్ గా ఆలోచించాలని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు.
Read Also: PM Narendra Modi: భారతదేశాన్ని స్టార్టప్ హబ్‌గా మార్చడంలో బెంగళూర్ కీలకం
మునుగోడు ఉప ఎన్నిక వల్ల నియోజకవర్గంలో బీజేపీ బలాన్ని పెంచుకోగా మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు మరింతగా దూసుకెళ్లవచ్చని కమలం పార్టీ అంచనా వేసింది. పక్కా ప్లాన్ తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లిందని..అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మునుగోడు ఫలితం తర్వాత పార్టీ పెద్దలు తెలంగాణ నేతలకు ఫోన్ చేసి అభినందించారని తెలుస్తోంది. ఓటమికి దారితీసిన పరిస్థితులను వారు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. మునుగోడులో ఓడినా తాము అనుకున్నది కమలనాథులు సాధించారని రాజకీయ వర్గాల్లో కూడా హాట్ డిస్కషన్ నడుస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు ఇదే దూకుడుతో వెళితే అప్పుడు మునుగోడు కోటలో బీజేపీ జెండా ఎగరేయడం పక్కా అంటున్నారు.
ముందునుంచీ మునుగోడు ఉప ఎన్నిక బలవంతంగా తెచ్చిందనీ, కేవలం రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే ఆయన బీజేపీలో చేరారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడంతో ళ్లగలిగింది. ఎన్నికల ప్రకటన రాకముందే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం, బీసీలకు తాయిలాలు ప్రకటించడం, కొన్ని నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేయడం, ఓటర్లకు ప్రలోభాల ఎర వంటివి టీఆర్ ఎస్ గెలుపునకు సహకరిస్తే.. బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు. మంత్రులందరినీ మోహరించడం, అధికార దుర్వినియోగం చేశారని, అందుకే టీఆర్ఎస్ గెలిచిందని బీజేపీ నేతలు విమర్శించారు.
మునుగోడులో ఓటింగ్ శాతం పెరగడం కూడా టీఆర్ఎస్ కి కలిసి వచ్చింది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే.. అది అధికార పార్టీకి మైనస్ అవుతుందని, ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని గతంలో భావించేవారు. కానీ అది నిజం కాదని మునుగోడులో నిరూపితమయింది. మునుగోడులో మొత్తం పోలైన 2,41,805 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 96,598 ఓట్లు రాగా, బీజేపీకి 86,697 ఓట్లు వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి 99,239 ఓట్లు రాగా, అప్పుడు టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 61,687ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ తరఫున పోటీచేసిన జి.మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి.
గతంతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరగడం ప్లస్ అంటున్నారు బీజేపీ నేతలు. 2023లో జరగబోయే ఎన్నికల్లో పక్కా ప్లాన్ తో వెళితే బీజేపీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు. మొత్తం మీద మునుగోడులో ఓడినా భవిష్యత్తులో బీజేపీ బలపడడానికి ఇది దోహదం చేసిందని, ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నియోజకవర్గంలో అందుబాటులో వుంటూ.. రాజగోపాల్ రెడ్డి ముందుకెళితే వచ్చేసారి బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈపోరులో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడవ స్థానానికి పడిపోయింది కాంగ్రెస్. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీకి ఇది బలంగానే చెప్పుకోవాలి.
Read Also: DigiLocker : మరిచిపోవడం, మోయాల్సిన భయం తప్పింది.. అందులో పెట్టి లాక్ వేస్తే సరి