NTV Telugu Site icon

Mudragada Vs Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సవాల్.. నిన్ను ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటా..!

Mudragada

Mudragada

Mudragada Vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు.. ఇక, రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్న ఆయన.. పవన్ బూతులు మాట్లాడుతున్నాడు.. విషయం మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక మాట్లాడుతున్నాడు.. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నాడు తెలుసుకో అని సూచించారు. తుని రైలు ఘటనకి చంద్రబాబు కారణం.. ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడు అని ఆరోపించారు.

నేను చవటను దద్దమ్మను.. కాపులు కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదు? అని నిలదీశారు ముద్రగడ.. పవన్ నా పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.. అసలు వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏంటి? అని నిలదీశారు. ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదన్న ఆయన.. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడు? అసలు పవన్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టాడు..? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీరు పెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా? అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానన్న ఆయన.. సినిమాలలో నటించండి.. రాజకీయాల్లో కాదు అని సూచించారు. నీ పార్టీ త్వరలో ఫ్యాకప్ అవుతుంది.. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్లుఎ ఎప్పుడైనా ప్రజలను అక్కున చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు ముద్రగడ.. ఉప్మా, కాపీ అని నన్ను పవన్ అవమానిస్తున్నాడు.. గౌరవం చేయడం మా అలవాటు.. సిగ్గు లేదా అలా అనడానికి? అని ఫైర్‌ అయ్యారు. నీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి అయినా కనీసం కాపీ ఇచ్చారా? అని నిలదీశారు. 1978లో చంద్రబాబుకి ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదు.. రెండు ఎకరాలు నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? అని ప్రశ్నించారు. ఇక, చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న ఆయన.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారు.. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదు..? అని నిలదీశారు. అయితే, ఇప్పుడు మద్దతుగా వీడియోలు రిలీజ్ ఇస్తే ప్రజలు నమ్ముతారా? అని నిలదీశారు ముద్రగడ పద్మనాభం.