Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

Mudragada Padmanabham Dies

Mudragada Padmanabham Dies

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరస్పరం ఫోన్‌లో మాట్లాడుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాలుగు సార్లు శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యే), ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈరోజు ఉదయం ఫోన్‌లో చర్చించారు. ముద్రగడ ప్రజా సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ గౌరవాలతో అంతిమ వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడకు అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.