NTV Telugu Site icon

Mudragada Letter: సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. మీకు తగునా అంటూ..!

Mudragada

Mudragada

కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు.

శుక్రవారం సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగ సూపర్ సిక్స్ హామీలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారని విమర్శించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ సూచనలు చెబుతూ లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే.. సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పలు పోస్టులు పెట్టగా.. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ ఎన్నో లేఖలు వదిలిన విషయం తెలిసిందే.