కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రాంతి నిత్యం జనాల్లో ఉంటూ.. ప్రజాదరణ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో క్రాంతి జనసేన కీలక పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్, సిబ్బందిని బెదిరించారన్న ఆరోపణలు రుజువు అవ్వడంతో జనసేన పార్టీ తమ్మయ్య బాబుపై చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలపై క్రాంతి ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ నియోజకవర్గ నేతలతో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి తాను నియోజకవర్గానికి రెగ్యులర్‌గా వస్తానని జనసేన కేడర్‌కు క్రాంతి చెప్తున్నారు.
ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ కోఆర్డినేటర్‌గా ముద్రగడ కుమారుడు గిరి ఉన్నారు. అదే నియోజకవర్గంలో సోదరి క్రాంతి జనసేన పార్టీ నుంచి యాక్టివ్ అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతానని చెప్పి.. చివరకు వైసీపీలో చేరారు. గత మార్చిలో ముద్రగడ అనారోగ్యం పాలవ్వగా.. గిరి తన సోదరి క్రాంతిని ఆస్పత్రికి కూడా రానివ్వని విషయం తెలిసిందే. మరి క్రాంతి ఆశించినట్లు ప్రత్తిపాడు నియోజకవర్గం పోస్ట్ వస్తుందేమో చూడాలి.