ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్‌లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!

Ms Dhoni Tribute Room

Ms Dhoni Tribute Room

MS Dhoni Tribute Room Launched: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు ధోనీ అందించిన సేవలు, అతడి విజయాలు, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఏ ఆటగాడికి లేని విధంగా.. ITC హోటల్స్ ప్రత్యేకంగా ‘MS Dhoni Tribute Room’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెన్నైలోని ITC గ్రాండ్ చోళ హోటల్‌లో ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసింది. ధోనీ అభిమానులకు అతడి క్రికెట్ ప్రయాణాన్ని దగ్గరగా అనుభూతి చెందేలా ఈ గదిని ప్రత్యేకంగా రూపొందించారు.

ఈ ప్రత్యేక గదిలో ధోనీ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అరుదైన జ్ఞాపకాలను ప్రదర్శిస్తున్నారు. అతడు ఉపయోగించిన జెర్సీలు, సంతకం చేసిన క్రికెట్ వస్తువులు, గ్లౌజులు, స్టంప్స్, ప్రత్యేక ట్రోఫీలను ఇందులో ఉంచారు. ధోనీ కెరీర్‌లో కీలకమైన విజయాలు, మరపురాని ఘట్టాలను గుర్తుచేసేలా ప్రత్యేక కళాకృతులు, ఫొటోలు, కథనాలను ఏర్పాటు చేశారు.

ఈ గదిలో మరో ప్రత్యేక ఆకర్షణగా ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7 ఉంది. ఈ నంబర్ స్ఫూర్తితో ప్రత్యేకంగా డిజైన్ చేసిన టవల్స్, కుషన్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను అతిథులకు అందించనున్నారు. గదిలోని ఇంటీరియర్ డిజైన్ నుంచి వ్యక్తిగత సదుపాయాల వరకు ప్రతి అంశంలోనూ ధోనీ ప్రత్యేకత కనిపించేలా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ధోనీకి ఇష్టమైన ఆహార పదార్థాల ఆధారంగా ‘ది కెప్టెన్స్ ప్యాంట్రీ’ (The Captain’s Pantry) పేరుతో ప్రత్యేక ఫుడ్ మెనూను కూడా రూపొందించారు. ITC Hotels మాస్టర్ చెఫ్‌లు ఈ వంటకాలను సిద్ధం చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనుభవాలు, జ్ఞాపికలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక ధోనీ క్రికెట్ ప్రయాణాన్ని వివరించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన కూడా ఈ గదిలో ఏర్పాటు చేశారు. రాంచీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న ధోనీ ప్రస్థానాన్ని ఇందులో చూపించనున్నారు. అతడి నిరాడంబరత, పట్టుదల, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణాలను ఈ ప్రత్యేక అనుభవం ద్వారా గుర్తుచేయనున్నారు. ధోనీ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా.. అతడి వ్యక్తిత్వం, క్రికెట్‌కు అందించిన సేవలను గౌరవించేలా ITC Hotels ఈ ప్రత్యేక గదిని రూపొందించింది.