Site icon NTV Telugu

MP Margani Bharat Ram: బాబు ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్..! పవన్‌ మేల్కొంటే మంచిది..!

Margani Bharat Ram

Margani Bharat Ram

MP Margani Bharat Ram: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్గాని భరత్ రామ్.. వెన్నపోట్లు పొడవడం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటేనని.. ఈ 2024 ఎన్నికలలో పవన్ కల్యాణ్‌ దొరికేసినట్లేనని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు వెన్నుపోటు పోడవడం వెన్నతో పెట్టిన విద్యే‌ అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి తమ మనుషులను పంపి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీలోకి టీడీపీ ఎంపీలు వెళ్లడం చంద్రబాబు డైరెక్షనే అని ఆరోపించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ట్రాప్ లో కచ్చితంగా పవన్ పడతారని జోస్యం చెప్పారు.

Read Also: Klin Kaara Caretaker: క్లీంకార కేర్‌ టేకర్‌ ను ఎక్కడి నుంచి దింపారో తెలుసా? – సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లను మించి నెల జీతం

ఇక, టిక్కెట్లు కోసం టీడీపీ వాళ్లనే చంద్రబాబు.. జనసేనలోకి పంపి.. గెలిచిన తర్వాత టీడీపీలోకి రప్పించుకోవడం ఖాయం అన్నారు ఎంపీ భరత్.. అంటే ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్ అయిందని.. ఎన్నికల ఫలితాల అనంతరం అసలు రహస్యం, చంద్రబాబు మోసాన్ని జనసేనాని పవన్ గ్రహించేసరికి పుణ్యకాలం ముగిసిపోతుందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులు గత మూడు దశాబ్దాలకు పైగా ఈ రాష్ట్ర ప్రజలు చూసి చూసి విసుగెత్తిపోయారన్నారు. ఇక చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించే పరిస్థితుల్లో జనం లేరని ఎంపీ భరత్ అన్నారు. సీట్ల సర్దుబాటు తదనంతర రాజకీయ పరిణామాలను ఇప్పటికైనా జనసేనాని గ్రహించి మేల్కొంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు, పవన్ అజెండా జగన్ ను అధికారంలో నుంచి దింపడమే తప్పిస్తే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన టీడీపీకి ఎందుకు ఓటేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ‌గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా, నెలనెలా పెన్షన్ అందుకోవాలన్నా లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతం అని.. ఈ రోజు ఇంటికే నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుంటే ఆ అవ్వాతాతల ముఖాలలో ఎంతో ఆనందం కనిపిస్తోందని అన్నారు. ప్రజలకు జగనన్న పాలనపై పూర్తి సంతృప్తి ఉందని.. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు ఎంపీ మార్గాని భరత్ రామ్.

Exit mobile version