లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. హిందువులు ఐక్యం కావాలన్నారు. ఈ నెల 22న అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేవాలయాలకు రక్షణ అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ప్రక్రియ మొదలయ్యిందని, ఈ సీజన్ లో పసుపు ధర 10 వేలకు తగ్గదన్నారు. 20 వేలు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో పసుపు రైతులకు బంగారు భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు.
రైతులు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. అయోధ్య వివాదానికి కాంగ్రెస్ కారణమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. రాహుల్… సోనియా లు జైశ్రీరాం అంటే వద్దంటామా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇక క్లోజ్ అయినట్లేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ అనే దృక్పధంతో ఈడీ చూస్తున్నట్లుందని, కవిత విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు జైల్ కు వెళతారో త్వరలో తెలుస్తుందని, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు 5వ సారి ఈరోజు నోటీసులు ఇచ్చారన్నారు. కవిత కు కూడా మళ్లి నోటీసులు రావచ్చు అన్నారు ఎంపీ అరవింద్.