Deepavali war: దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది. విశ్వక్ సేన్, వెంకటేశ్ నటించిన రీమేక్ మూవీ ‘ఓరి దేవుడా’తో పాటు తమిళ అనువాద చిత్రాలు ‘ప్రిన్స్’, ‘సర్దార్’ దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల అవుతున్నాయి.
అయితే దీపావళి రోజు 25న విడుదల కాబోతున్న మరో రెండు సినిమాల విషయంలో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. అవి ‘రామ్ సేతు’, ‘హర్ హర్ మహాదేవ్’. చిత్రం ఏమంటే ‘హర్ హర్ మహాదేవ్’ను జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ‘రామ్ సేతు’ మూవీని అదే సంస్థ పంపిణీ చేస్తోంది. అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించిన ‘రామ్ సేతు’లో జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో పాటు తెలుగువాడైన సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రావణుడిని వధించి, సీతాదేవిని తీసుకు రావడానికి శ్రీ రాముడు భారతదేశం నుండి రామసేతు మీదుగానే లంకకు చేరుకున్నాడు. రామసేతు ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్తలు రామాయణ గాథ వాస్తవమని, అది చరిత్ర అని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. అవే అంశాలను ‘రామ్ సేతు’ చిత్రంలోనూ దర్శకుడు చర్చించబోతున్నాడు.
రామసేతువు నేపథ్యంలో చారిత్రక అంశాలతో తెరకెక్కిన సినిమా ‘రామ్ సేతు’ కాగా… దీనితో పాటే 25వ తేదీ విడుదల కాబోతున్న ‘హర్ హర్ మహాదేవ్’ కూడా చారిత్రక చిత్రమే. హిందూ పద్ పాద్షాహీగా కొనియాడబడిన శివాజీ మహారాజ్ సైన్యాధికారి అయిన బాజీ ప్రభు దేశ్ పాండే జీవితం ఆధారంగా ఈ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించింది. శివాజీ కంటే పదిహేను సంవత్సరాలు పెద్దవాడైన బాజీ ప్రభు పన్హాలా కోట నుండి శివాజీ తప్పించుకోవడానికి దోహదపట్టాడు. శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి బాజీ ప్రభు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మరాఠీలో తెరకెక్కిన ఆ యోధుడి సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ డబ్ అయ్యి రిలీజ్ కాబోతోంది. ఓ మరాఠీ చిత్రం ఇలా వివిధ భారతీయ భాషల్లో అనువాదమై ఒకే రోజు విడుదల కావడం ఇదే తొలిసారి. సో… 25వ తేదీ తెలుగువారి ముందుకు వస్తున్న ఈ రెండు చారిత్రక అనువాద చిత్రాలలో దేనికి ఆదరణ లభిస్తుందో చూడాలి.