సాధారణంగా నటినటులు పలు కార్యక్రమాల్లో జనాల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వారిని తాకడానికి లేదా ఫొటోల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడానికి కొందరు అకతాయిలు ప్రయత్నిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటి ఘోర అవమానమే ఎదురైంది. వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?
వేదికపైకి వెళ్తుండగా, తాత వయస్సున్న ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ఫోటోల పేరుతో తన నడుముపై చేతులు వేసి ఇబ్బంది పెట్టారని మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశారు. తానకు ఇబ్బందిగా ఉందని చెప్పిన వినకపోగా, స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంలో కూడా అసభ్యకరమైన సైగలు చేస్తూ, వీడియోలు తీస్తూ వేధించినట్లు ఆమె వెల్లడించారు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు కానీ, అక్కడ ఉన్న పెద్దలు కానీ వారిని ఆపే ప్రయత్నం చేయకపోవడం తనను మరింత బాధించిందని ఆమె వాపోయారు. “నాలాంటి నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏంటి?” అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
