Site icon NTV Telugu

Crime News: తాళిబొట్టు కొట్టేసిన కొడుకు.. పోలీసులకు పట్టించిన తల్లి

Son

Son

Crime News: జీవితంలో తాము పడిన కష్టాలను తమ బిడ్డలు పడవద్దని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారి సర్వశక్తులు ఒడ్డుతారు. ఎంత కష్టపడినా తమ సంతానం తప్పుదారి పడితే వారి బాధ వర్ణణాతీతం. సరిగా ఇలాంటి పరిస్థితే ముంబైలో కన్నతల్లికి ఎదురైంది. తన అవసరాలకు డబ్బు అందలేదని తాళిబొట్టు దొంగతనానికి యత్నించాడు. కొడుకు దొంగగా మారడంతో తట్టుకోలేని తల్లి అతడిని పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై విష్ణు నగర్‌ దేవి చౌక్‌లో సోమవారం ఉదయం ఓ దొంగతనం జరిగింది. ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడ నుంచి తాళి బొట్టును లాక్కుని వెళ్లాడు ఓ వ్యక్తి. ఆ పెనుగులాటలో ఆమె కాలికి గాయం అయ్యింది కూడా. ఆలస్యం చేకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. విష్ణు నగర్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు.

Read Also: Karnataka Farmer : 205కేజీల ఉల్లి కేవలం 8రూపాయలు

పసుపు రంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఫొటోను వాట్సాప్‌ గ్రూపుల్లో పంపించి.. అతన్ని ట్రేస్‌ చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో.. విష్ణు నగర్‌ పోలీసులు ఫూలే నగర్‌ వాసి నుంచి అతని గురించి తెలుసనే సమాచారం వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె పేరు తానిబాయి రాజు వాఘ్రి. ఆ ఫొటోలో ఉంది తన కొడుకు కణు అని చెప్పిందామె. అయితే అతని గురించి ఎందుకు అడుగుతున్నారని పోలీసులను నిలదీసింది.  దీంతో పోలీసులు.. అతనికి యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పారు. అయితే.. అతను ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. దీంతో అతను చేసిన పనిని ఆమె వివరించారు. తన కొడుకు తాళిబొట్టు దొంగతనం చేశాడన్న వార్త విని ఆ తల్లి బాధపడింది. పోలీసులను దగ్గరుండి మరీ ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. తన భార్యకు సర్జరీ అయ్యిందని, పూల వ్యాపారం నడవకపోవడంతో ఖర్చులకోసం ఇలా దొంగతనం చేయాల్సి వచ్చిందని కణు నేరం ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బు అవసరం అయిన మాట వాస్తవమే అయినా.. ఇలా కొడుకు దొంగతనానికి పాల్పడడం భరించలేకపోతున్నానని కన్నీళ్లతో కణు తల్లి చెప్పింది.

Exit mobile version