Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం.. హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతం
అత్యంత రద్దీగా ఉండే టైమ్ అదే టైమ్‌లో రెచ్చిపోయిన బీహార్ దొంగల ముఠా ముఖానికి మాస్కులు .. చేతులకు గ్లౌవ్స్.. నెత్తిన టోపీలు పక్కా ప్లాన్‌తో ఖజానా జువెలరీలోకి ఎంట్రీ లాకర్ రూమ్ దగ్గరకు తీసుకు వెళ్లాలని బెదిరింపు గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపిన దుండగులు.
Read Also : Coolie : వామ్మో.. ‘కూలీ’ ఒక్క టికెట్ ఎన్ని వేలో తెలుసా..?
సరిగ్గా అదే టైమ్‌లో బీహార్ నుంచి వచ్చిన ఆరుగురు దొంగల ముఠా రెచ్చిపోయింది. చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ చేసేందుకు లోపలికి చొరబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించారు.. చేతులకు గ్లౌవ్స్.. నెత్తిన టోపీలు పెట్టుకున్నారు. పక్కా ప్లాన్‌తో ఎంట్రీ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతూనే వాళ్లకు ఖజానా జువెలరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీష్ కనిపించాడు. అతన్ని పట్టుకుని ముగ్గురు దొంగలు షాపు లోపలికి వెళ్లారు. అతన్ని లాకర్ రూమ్ దగ్గరకు తీసుకు వెళ్లాలని బెదిరించారు. సతీష్ తలకు తుపాకీ ఎక్కు పెట్టారు. ఐతే అతను బెదరలేదు. కానీ లాకర్ ఎక్కడో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. కానీ దోపిడీ దొంగలు ఊరుకోలేదు. అతన్ని మరింత బెదిరించేందుకు గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులు విన్న తర్వాత మిగతా స్టాఫ్ అంతా అప్రమత్తమయ్యారు…
దుండగులు గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. షాపులో ఉన్న సిబ్బంది.. ఏదో జరుగుతోందని ఊహించారు. దీంతో అంతా కలిసి ఒక్కటై దొంగల వెంట పడ్డారు. షాపులోని నగలతో కూడిన చెస్ట్ సంబంధించిన కీస్ ఎవరూ ఇవ్వలేదు. కానీ దోపిడీ దొంగలు మాత్రం తుపాకులతో బెదిరిస్తూనే బంగారు ఆభరణాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటికీ లాక్స్ ఉండడంతో ఏమి చేయాలో అర్థం కాలేదు. దీంతో షో కేసుల్లో ఉన్న వెండి ఆభరణాలను మొత్తం తీసుకున్నారు.
దాదాపు 5 నిమిషాల పాటు ఖజానా జ్యువెలర్స్ షాప్ లోనే ఉన్నారు. ముగ్గురు ముగ్గురుగా షాప్‌లోకి వచ్చిన దోపిడి దొంగలు మొత్తం అందర్నీ బెదిరించారు. ముగ్గురు దోపిడి దొంగల వద్ద తుపాకులు ఉన్నాయి. ఆ తుపాకులతోనే సిబ్బంది మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. సిబ్బంది ఏకమై ఒక్కసారిగా అత్యవసర నెంబర్ 112 కి ఫోన్ చేశారు. పోలీసులకు సమాచారం వెళ్లిందన్న అనుమానం దొంగలకు వచ్చింది. షాప్‌లో ఉన్న చెస్ట్ కీస్ దొరకపోవడంతో దొంగలు ఒకసారిగా పిచ్చిపిచ్చిగా అరిచారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ కీస్ కోసం అందర్నీ బెదిరించారు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఊహించని పరిణామంతో వెంటనే దోపిడీ దొంగలు షాపు నుంచి బయటికి వెళ్లిపోయారు.
ఇక వారు వెళ్లిపోయిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాలతోపాటు బయట ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. దోపిడీ దొంగలు రెండు బైకుల మీద వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. అయితే దొంగలు రెండు బృందాలుగా విడిపోయి ఒక గ్యాంగ్ సంగారెడ్డి.. మరో గ్యాంగ్ వికారాబాద్ వైపునకు వెళ్ళినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని సైతం పోలీసులు సేకరించారు. బైక్ నెంబర్ ఆధారంగా చూస్తే అది నకిలీ నెంబర్ అని తేలిపోయింది. అయితే మహారాష్ట్ర లేదంటే కర్ణాటక ప్రాంతంలో బైక్ ని దొంగతనం చేసి దాని మీద హైదరాబాద్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లోకి వెళ్లి హంగామా చేశారు. వారిపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఆభరణాలు దోచుకొని పోయారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎమ్మార్వో నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించారు. రూ 2 లక్షల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. వృద్ధులపై దాడి చేయడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. ఐతే ఇద్దరు దొంగల్లో ఒకడు.. వారిని పక్కన కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. ఎక్కువ గొడవ చేయవద్దు అని బెదిరించాడు. ఈ దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు..